NIMS Hospital Expansion: ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2 వేల పడకల నూతన నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించే విధంగా ఉండే ఈ నూతన నిర్మాణానికి అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేసుకొని, నిర్మాణం మొదలు పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తొలి సమీక్ష నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. 8 అంతస్తుల్లో నిర్మించే నూతన నిమ్స్ నిర్మాణం అందుబాటులోకి వస్తే.. 1500గా ఉన్న పడకల సంఖ్య మొత్తం 3500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తయితే తద్వారా మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఒక్క నిమ్స్‌లోనే మొత్తం 3700 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా నిమ్స్ సేవలు మరింత విస్తృతం అవుతాయని చెప్పారు. నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలన్నారు. దీంతో పాటు గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ తెలంగాణలో నెలకొని ఉన్నట్లు అవుతుందన్నారు. ఫెర్టీలిటీ సేవలు ప్రజలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ పనులు వేగవంతం చేయాలన్నారు. 


నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా.. గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిపి.. అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి పీహెచ్‌సీ, బస్తీ దవాఖాన, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్ 1 ఉండేలా కృషి చేయాలని సంబంధిత విభాగానికి ఆదేశించారు. నూతనంగా ప్రారంభించిన ఎం ఎన్ జే ఆసుపత్రి ఆంకాలజీ బ్లాక్ లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాలన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలన్నారు. కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నారు.  


స్టాఫ్ నర్స్ పరీక్ష ఆన్లైన్ ద్వారా.. 


వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో భర్తీ చేసే 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటివరకు 40,936 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష కోసం హైదరాబాద్ తో పాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో సెంట్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల తుది ఫలితాలు విడుదల కంటే ముందే అసిస్టెంట్ ప్రొఫెసర్ల ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  


Also Read: YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?  


Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి