ఇఫ్తార్ విందుపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
రాజా సింగ్‌పై ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు
హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజా సింగ్‌పై ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. మైనారిటీల ఓటు బ్యాంకు కోసమే రాజకీయ పార్టీలు వారికి ఇఫ్తార్ పార్టీలు ఇస్తుంటాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీశాయని పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. సోమవారం సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో షేర్ చేసుకున్న రాజా సింగ్.. మైనారిటీల ఓట్లు అడుక్కునే వారే వారికి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారని ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను అటువంటి విందులు ఇవ్వను, అలాగే అటువంటి వాటికి హాజరుకాను అని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలకు ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని సైతం రాజా సింగ్ తప్పుపట్టారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని కేంద్రం వద్ద నిధుల కోసం అర్థిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మైనారిటీ ఓట్ల కోసం వారిని సంతృప్తి పరిచేందుకు రూ.66 కోట్లు వెచ్చించి మరీ ఇఫ్తార్ విందు ఇస్తున్నారని దుయ్యబట్టారు. రాజాసింగ్‌పై ఈ తరహా కేసులు నమోదవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులపై రాజా సింగ్‌పై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.