హైదరాబాద్ మెట్రోరైలు కారిడార్‌-1 (రెడ్‌లైన్:మియాపూర్‌-ఎల్‌బీనగర్‌) సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇవాళ మధ్యాహ్నం అమీర్‌పేట-ఎల్‌బీనగర్ మెట్రోమార్గాన్ని మధ్యాహ్నం 12.15గంటలకు గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి కే. తారకరామారావు కలిసి ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. గవర్నర్‌తో కలిసి వీరంతా మెట్రోలో అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు ప్రయాణిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణికులకు అనుమతిస్తారు. మియాపూర్-ఎల్‌బీనగర్‌ మధ్య దూరం 29.21 కి.మీ.లు. మొత్తం స్టేషన్లు 27స్టేషన్లు. టికెట్ ధర ₹10 నుండి ₹60 వరకు ఉంటుంది. అమీర్‌పేట-ఎల్‌బీనగర్ టికెట్ ధర ₹45 ఉండవచ్చు. స్మార్ట్ కార్డు వినియోగదారులకు టికెట్‌పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెట్రోరైలు కారిడార్‌-1లోని కొంత దూరం మియాపూర్‌- అమీర్‌పేట, కారిడార్‌-2లోని నాగోల్‌- అమీర్‌పేట వరకు 30 కి.మీ. మార్గాన్ని గతేడాది నవంబరు 28న ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం ప్రారంభించే మెట్రో మార్గంతో కలిపి హైదరాబాద్‌లో 46 కి.మీ. మెట్రో అందుబాటులోకి రానుంది. దీంతో దేశంలోనే అత్యంత పొడవైన మెట్రోరైలు మార్గాల్లో ఇది రెండోది అవుతుంది.


మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉప్పల్‌ డిపోలో ఉంది. మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్‌ వ్యవస్థ ఉంది.