Hyderabad Metro Phase 2 Works: ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా  అలైన్‌మెంట్ ఖరారు    అయింది. గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులు త్వరితం చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత ఉండాలనే విషయంలో ఈ డేటా కీలకమవుతుందన్నారు. ఆదివారం ఉదయం ఈ సర్వే పనులను ప్రాంభించిన ఆయన.. హెచ్ఎఎంఎల్ సీనియర్ ఇంజనీర్ల బృందంతో కలిసి రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ దాకా ఉన్న ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కి.మీ పొడవు ఉన్నఈ మార్గంలో కాలినడకన నడుస్తూ ఇంజనీర్లకు, సర్వే బృందాలకు  తగిన ఆదేశాలు ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెట్రో స్టేషన్ల నిర్మాణం  ప్రధాన రహదారి జంక్షన్‌లకు దగ్గరగా ఉండాలని ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశించిన విధంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌ను నగర విస్తరణ ప్రణాళికలో భాగంగా నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడేలా తయారు చేయాలన్నారు. ఇక్కడ నుంచి ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిమిషాల వ్యవధిలో  చేరుకునేలా ఈ కారిడార్‌ను డిజైన్ చేయాలని అన్నారు.  


రాయదుర్గ్ స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం రాయదుర్గ్ స్టేషన్‌ను పొడిగిస్తున్నప్పుడు.. పొడిగించిన బ్లూ లైన్ కొత్త టెర్మినల్ స్టేషన్, ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్‌లను అనుసంధానానికి సంబంధించిన అవకాశాలను అన్వేషించామన్నారు. ఈ ప్రదేశంలో స్థలాభావం ఉన్నందున ఐకియా భవనం తర్వాత ఎల్ అండ్ టీ-అరబిందో భవనాల ముందు ఈ రెండు కొత్త స్టేషన్‌లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించామని తెలిపారు.


మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్ పోర్ట్ కొత్త రాయదుర్గ్ స్టేషన్, పొడిగించిన కొత్త బ్లూ లైన్  స్టేషన్ పైన రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో కారిడార్ 2 (గ్రీన్ లైన్)లో నిర్మించిన జేబీఎస్ స్టేషన్, అలాగే అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ స్టేషన్‌ల మాదిరిగా నాలుగు అంతస్తుల్లో ఈ స్టేషన్ల నిర్మాణం ఉండబోతుందన్నారు.


'బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ మీదుగా ఎయిర్‌పోర్ట్ మెట్రో వయాడక్ట్ క్రాసింగ్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇక్కడ కొత్తగా వేసిన అదనపు హై వోల్టేజ్ అండర్‌గ్రౌండ్ కేబుళ్లను మార్చవలసిన అవసరం లేకుండా చేయాలి. అలాగే మెట్రో మొదటి దశలో సైబర్ టవర్స్ జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర చేసినట్లు, ఫ్లైఓవర్ ర్యాంప్ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌కు ఆనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తర్వాత, ట్రాఫిక్ కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలి. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రే స్టేషన్‌ను ప్లాన్ చేసేటప్పుడు, ఇదే మార్గంలోనే సమీప భవిష్యత్తులో  నిర్మించనున్న బీహెచ్ఈఎల్-లక్డీ కా పుల్ మెట్రో కారిడార్ అవసరాలపై కూడా దృష్టి సారించాలి


నానక్‌రామ్‌గూడ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణ విషయంలో అక్కడ నాలుగు దిక్కుల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను విశ్లేషించాలి. ఇక్కడ నిర్మించబోయే స్కైవాక్‌ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వారి ప్రయాణ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించే అవకాశాన్ని పరిశీలించాము. నార్సింగి, కోకాపేట, ఇతర సమీప ప్రాంతాలలో  వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి  నార్సింగి జంక్షన్ సమీపంలో నిర్మించే మెట్రో  స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు ఆవల నుంచి వచ్చే ప్రయాణికులను అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి..' అని ఎన్వీఎస్ రెడ్డి సూచించారు.


Also Read: WTC Points Table: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌-2లోకి టీమిండియా.. ఫైనల్‌కు చేరే సమీకరణలు ఇవే..  


Also Read: WTC Points Table: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌-2లోకి టీమిండియా.. ఫైనల్‌కు చేరే సమీకరణలు ఇవే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook