హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే పురుషులు ఇక పై జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఏ మాత్రం ఆదమరిచి మహిళల సీట్లలో కూర్చున్నా..ఇక ఇంతే సంగతులు. రూ.500 జరిమానా క్రింద చెల్లించాల్సిందే. ఈ కొత్త పద్ధతి ఈ రోజు నుండి అమలులోకి వస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సోమవారం మెట్రో అధికారులు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. ఈ నిర్ణయం తీసుకున్నారు. సీట్లలో కూర్చొనే విషయంలో పురుషులు జాగ్రత్తగా ఉండాలని.. మహిళలతో పాటు సీనియర్ సిటిజన్స్, వికలాంగుల సీట్లు ఖాళీగా ఉన్నా వాటిలో కూర్చోకూడదని.. అలా కూర్చుంటే జరిమానా చెల్లించాల్సిందేనని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే మెట్రోలో భద్రతా వ్యవస్థను కూడా పటిష్టం చేయనున్నట్లు తెలిపారు.  ఎల్‌అండ్‌టీ భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో కలిసి పనిచేస్తారని.. మెట్రోలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అన్నారు. ముఖ్యంగా మెట్రో రైళ్ళలో ఈవ్ టీజింగ్ లాంటి వాటికి అడ్డుకట్ట వేయనున్నామని.. మహిళల రక్షణ తమ ప్రథమ బాధ్యత అని మెట్రో ఎండీ తెలిపారు. 


మహిళలు తమకు మెట్రో రైళ్ళలో ఎవరివల్లనైనా ఇబ్బంది ఎదురైతే.. వెంటనే మెట్రో అధికారులకు హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. అందుకోసం వాట్సాప్ నెంబరు కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఒక మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేస్తే చాలు.. వెనువెంటనే వచ్చి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌, నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు జరుగుతున్న మెట్రో పనులను వేగవంతం చేస్తున్నామని.. అలాగే ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో కలిసి భద్రతా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు.