హైదరాబాద్లో ఆపరేషన్ ఛబుత్రా: పోలీసుల అదుపులోకి 110 మంది యువకులు!
హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఛబుత్రా
హైదరాబాద్: నగర శివార్లలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్ ఛబుత్రాలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భారీ సంఖ్యలో పలు ప్రాంతాలను చుట్టుముట్టిన పోలీసులు అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న సుమారు 110 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో కొంత మంది అర్థరాత్రి దాటాకా కూడా ద్విచక్రవాహనాలపై చక్కర్లు కొడుతూ వీధుల్లో హంగామా చేస్తుండగా ఇంకొందరు బస్తీలోని కూడళ్ల వద్ద గుంపులు గుంపులుగా కూర్చుని బెట్టింగులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
ఆపరేషన్ ఛబుత్రలో భాగంగా అదుపులోకి తీసుకున్న యువతకు ఏసీపీ అశోక చక్రవర్తి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులను మందలించిన పోలీసులు.. ఆ తర్వాత యువకుల తల్లిదండ్రుల సొంత పూచికత్తుపై వారిని విడిచిపెట్టారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు రౌడీషీటర్లు, నలుగురు దొంగలు కూడా ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలా ఆపరేషన్ ఛబుత్రా చేపట్టిన పోలీసులు భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.