హైదరాబాద్: దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్యకు పాల్పడిన కేసులో  నిందితులుగా ఉన్న నలుగురు పారిపోతుండగా సైబరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే అత్యాచారం, హత్య చేసి శవాన్ని దహనం చేశారో.. అక్కడే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నవంబర్ 27న రాత్రి దిశ హత్య జరగగా 28న ఉదయం ఆమె హత్య ఉదంతం వెలుగుచూసింది. దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరుతెన్నులపై అధ్యయనం చేసేందుకు గురువారం రాత్రి నిందితులను ఘటనస్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అర్థరాత్రి దాటి తెల్లవారితే శుక్రవారం అనగా డిసెంబర్ 6న తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నిందితులు మహ్మద్‌ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్‌‌‌ ఘటనాస్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. మరో మార్గం లేకే వారిని ఎన్‌కౌంటర్ చేసినట్టు పోలీసులు తెలిపారు.