'కికి' చాలెంజ్ స్వీకరించిన హీరోయిన్ రెజీనాపై హైద్రాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రాణానికి హాని కల్గించే ఇలాంటి ప్రయోగాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ప్రాణాంతకపు 'కికి' చాలెంజ్ స్వీకరించిన హీరోయిన్ రెజీనా.. నడుస్తున్న కారు డోర్ తీసుకుని కిందకు దిగి.. కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ కారుతో పాటే నడిచి తిరిగి కారు ఎక్కింది. దీనికి సంబంధిన వీడియోను రెజీనా సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. సోషల్ మీడియా పుణ్యంతో ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులు రెజీనాకు వార్నింగ్ ఇచ్చారు.


ఎవ్వరైనా సరే చర్యలు తప్పవు


సెలబ్రిటీలు ఇలా ప్రాణాంతకపు పనులు చేస్తే.. సామాన్యులు కూడా దీన్ని  అనుసరిస్తారని ..ఫలితంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడవచ్చని హైద్రాబాద్ ట్రాఫిక్ ఏసీపీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ప్రాణానికి హాని కల్గించే అలాంటి ఫీట్లు చేయోద్దని రెజీనాను హెచ్చరించామన్నారు. 'కికి' చాలెంజ్ స్వీకరించి రోడ్లపైకి వస్తే ఎంతరివారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు. పైగా ఇలాంటి చాలెంజ్ వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తతాయని హైద్రాబాద్ ట్రాఫిక్ ఏసీపీ అనిల్ కుమార్ అభిప్రాయపడ్డారు.


ఇంతకీ ఏంటా 'కికి ఛాలెంజ్'


'కికి ఛాలెంజ్' లేదా 'ఇన్ మై ఫీలింగ్స్ ఛాలెంజ్' పేరిట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ హల్‌చల్ చేస్తోంది. ఇన్ మై ఫీలింగ్స్ అనే పాట ప్లే అవుతుండగా కొద్దిపాటి వేగంతో ప్రయాణిస్తున్న కారులోంచి దిగి ఈ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేయడమే ఈ కికి ఛాలెంజ్ స్వీకరించాల్సిన వాళ్లు చేయాల్సిన పని. ఇలాంటి ప్రాణాంతకపు ఛాలెంజ్ ను హీరోయిన్ రెజీనా స్వీకరించడంతో హైద్రాబాద్ పోలీసులు ఆమెను ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.