TARGET KTR: ఫీనిక్స్ తో కేటీఆర్ ఫినిష్! పూర్తి ఆధారాలతో రంగంలోకి ఐటీ.. గులాబీ పార్టీలో కలవరం
TARGET KTR: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది.ఫీనిక్స్ సంస్థల్లో ఐటీ సోదాలు జరగడం రాజకీయ సెగలు రేపుతోంది
TARGET KTR: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అటు బీజేపీ నేతలు కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. తెలంగాణలో గత ఎనిమిది ఏళ్లుగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న కమలం పార్టీ పెద్దలు.. అవినీతి బాగోతం మొత్తం బయటికి తీస్తామని చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చిన రోజునే.. ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. కవితే స్వయంగా డీల్ చేసిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ రచ్చ సాగుతుండగానే హైదరాబాద్ లోని టాప్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఒకటిగా ఉన్న ఫీనిక్స్ సంస్థల్లో ఐటీ సోదాలు జరగడం రాజకీయ సెగలు రేపుతోంది. మంత్రి కేటీఆర్ టార్గెట్ గానే ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
ఫీనిక్స్ గ్రూప్ చైర్మెన్ సురేష్ చుక్కపల్లి మంత్రి కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఫీనిక్స్ సంస్థలో కేటీఆర్ భారీగా పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఫీనిక్స్ కు ప్రయోజనం కలిగేలా రూల్స్ కు విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. లిటిగేషన్ భూములను క్లియర్ చేసుకుంటూ ఫినిక్స్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నుంచి ప్రభుత్వంలోని లిటిగేషన్ భూములను గుర్తించి.. వాటిని క్లియర్ చేసుకుందని గతంలో ఫిర్యాదులు వచ్చాయి. చెరువులను కూడా కబ్జా చేశారంటూ ఫీనిక్స్ గ్రూప్ పై కొందరు ఎన్టీజీని కూడా అశ్రయించారు. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐీసీ ద్వారా భూముల కేటాయింపు జరిగిందని.. మంత్రి కేటీఆర్ కు సంబంధించిన సంస్థ కావడంతో అధికారులు ఆగమేఘాల మీద ఆ సంస్థకు భూములు కేటాయించారని విపక్షాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. ఫినిక్స్ గ్రూప్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని దాదాపు 70వేల కోట్ల రూపాయల విలువైన భూములను గత ఏడేళ్లగా అప్పనంగా అప్పగించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ప్రస్తుతం దాదాపు లక్షా 50 వేల కోట్ల వ్యాపారం చేస్తుందని తెలుస్తోంది. భోగి శ్రీధర్ రావు బినామీగా జరుగుతున్న అక్రమ దందాపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు రావడంతో ఆరా తీసిన పెద్దలు భారీగా అక్రమాలు జరుగుతున్నాయని నిర్దారించారని తెలుస్తోంది.
ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు బెస్ట్ బ్లాక్ మనీ హబ్ బిజినెస్ వర్గాల్లో పేరుందని తెలుస్తోంది. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు రాజకీయ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు ఫీనిక్స్ లో పెట్టుబడులు పెడతారనే టాక్ ఉంది. తమ బినామిలను తమ కంపెనీల్లోనే డైరెక్టర్స్ గా చేర్చుకుని.. ఇతర కంపెనీలను పెట్టుబడి పెట్టేలా ఆహ్వానిస్తూ ఉమ్మడిగా ప్రాజెక్ట్ నిర్వహిస్తుందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో లాభాలు ఉండే ప్రాజెక్ట్స్ కోసం చుక్కపల్లి సురేష్ కుటుంబ సభ్యులే అనుమతులు తీసుకుంటారు. చుక్కపల్లి ఫ్యామిలీ నుంచి అప్లికేషన్ వచ్చిన వెంటనే క్లియర్ అవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఇలా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా దాదాపు 14 ప్రాజెక్టును ఫినిక్స్ పేరుతో ప్రభుత్వ అధికారుల నుంచి ప్రత్యేక జీవోలు తెచ్చుకుందని తెలుస్తోంది. అన్ని సక్రమంగానే చేస్తున్నామని పైకి కలరింగ్ ఇస్తూ లోపల మొత్తం చేయాల్సిన అక్రమ దందా మొత్తం ఫీనిక్స్ సంస్థ చేసేస్తోందని అంటున్నారు. నగర శివారుల్లోని పలు చెరువలను ఇలా కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
నార్సింగ్ అవతార్ జంక్షన్ లోని చెరువులో ఏడు ఎకరాలు కబ్జా చేశారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఓఆర్ఆర్ పక్కనే ఉన్న చెరువుపై కన్నేసిన ఫీనిక్స్ గ్రూప్.. అధికారులను మేనేజ్ చేసి లేక్ ఐడీని హెచ్ఎండీఏ నుంచి తొలగించారని అంటున్నారు. ఖరీదైన ప్రాంతంలో పదెకరాల చెరువుని కబ్జా చేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ప్రభుత్వ పెద్దలది కాబట్టే అధికారులు అటు వైపు కన్నేతి చూడలేదని అంటున్నారు. హెచ్ డీఎంఏ పరిధిలోని భూములకు కూడా టీఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఎలాంటి కట్టడాలకు అవకాశం లేని గ్రీన్ జోన్ పరధిలోని భూముల్లో సైతం నిర్మాణాలు చేపట్టారని చెబుతున్నారు. పుప్పాలగూడలోని రెవిన్యూ పరిధిలోని ఇనాం భూములను ఫీనిక్స్ గ్రూప్ కబ్జా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెంబర్ 263 నుంచి 273 వరకు 8 వందల కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని ఫీనిక్స్ గ్రూప్ అక్రమ పద్దతుల్లో స్వాహా చేసిందని అంటున్నారు. పుప్పాలగూడలోని మేకసాని కుంట, మామాసాని కుంట, బొలక్ పూర్ నాలాను చుక్కపల్లి సురేష్ కుటుంబం స్వాహా చేసినా ఎవరు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. చెరువులనూ పూడ్చడంపై కొందరు సామాజిక కార్యకర్తలు ఎన్జీటీలో పిటిషన్ వేసినా.. సంబంధిత రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ అఫిడవిట్ దాఖలు చేయలేదని అంటున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ వన్ లో నిర్మించిన ఫినిక్స్ ఐవీవైపైనా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఐదంతస్తుల పార్కింగ్, 10 అంతస్తులు కమర్షియల్ స్పేస్ తో పాటు బేస్మెంట్ కూడా నిర్మించారు. ఒక్కో స్క్వెయర్ ఫీట్ ను 15 వేల ధరకు సేల్ చేశారు. ఒక్కొక్క ఫ్లోర్ లో 25 వేల ఎస్ఎఫ్టీ ఉంది. అంటే మొత్తం ఆ భవంతి విలువ రూ. 370 కోట్లు. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినా.. పెత్తనం మొత్తం ఫీనిక్స్ గ్రూప్ దే. రేరా చట్టానికి విరుద్ధంగా వాణిజ్యస్థలం పేరుతో వినియోగదారులను మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఫినిక్స్ ఐవీవైపై సంస్థ ఎండీ గోపికృష్ణకు గతంలో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. భూములు ఇచ్చారు.. సర్కార్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు.. ప్రాజెక్టు ద్వారా ఎంత అదాయం వచ్చిందన్న వివరాలు సేకరించింది ఐటీ శాఖ. ప్రమోటర్స్ నుంచి వివరాలు తీసుకుంది. ఐటీ నోటీసులకు సమాధానం ఇచ్చిన ఎండీ అంతా సక్రమంగానే చేశామని చెప్పుకొచ్చారు. అయితే ఫీనిక్స్ టవర్ లో ప్లాట్స్ కేటాయింపు అక్రమమని విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. ఆ రిపోర్టు ఆధారంగానే తాజాగా ఐటీ సోదాలు జరుగుతున్నాయని సమచారం. ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలతో అధికార టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపిందని అంటున్నారు.
Read also: BANDI SANJAY ARRET: జనగామ జిల్లాలో బండి సంజయ్ అరెస్ట్.. ధర్మదీక్షను భగ్నం చేసిన పోలీసులు
Read also: MLA RAJA SINGH ARREST: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. వివాదాస్పద వీడియో డిలీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి