ఇవాంకా ఎఫెక్ట్ : హైదరాబాద్‌లో హై అలర్ట్
ఇవాంకా ట్రంప్ సందర్శనను పురస్కరించుకొని దాదాపు 2 వేలమంది పోలీసులు భద్రతా బందోబస్తులో పాల్గొననున్నారు.
"గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్" మీట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సందర్శనను పురస్కరించుకొని నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీనివాసరావు ప్రెస్ మీట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. గోల్కొండ, ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీ నుండి ఆంక్షల్లో భాగంగా గోల్కొండ కోటలోకి సందర్శకులకు అనుమతి కూడా ఉండదని ఈ ప్రెస్ మీట్‌లో కమీషనర్ వెల్లడించారు. అదేవిధంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగించాలని తమకు ఉత్తర్వులు అందినట్లు కమీషనర్ తెలిపారు. ఇప్పటికే అమెరికా పోలీసులు ఈ విషయంపై కమీషనర్‌తో మాట్లాడారు. అమెరికన్ పోలీస్ దళాలు కూడా ఇవాంకా భద్రతలో భాగంగా హైదరాబాద్‌లో కాపుగాయనున్నాయి.
ఇవాంకా ట్రంప్ సందర్శనను పురస్కరించుకొని దాదాపు 2 వేలమంది పోలీసులు భద్రతా బందోబస్తులో పాల్గొననున్నారు. ఇటీవలే అమెరికన్ పోలీసు విభాగంతో పాటు అమెరికా సీక్రెట్ ఏజెన్సీ ప్రతినిధులు కూడా వచ్చి తెలంగాణ పోలీసు అధికారులను కలిశారు. భద్రత ఏర్పాట్లన్నీ కూడా అమెరికన్ పోలీసు సిబ్బంది పర్యవేక్షణలోనే జరుగుతాయని.. అన్ని వివరాలు వారికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆ సిబ్బంది కోరినట్లు సమాచారం. అదేవిధంగా ఇవాంకా బయటకు వచ్చేటప్పుడు అమెరికన్ పోలీసులు ఆమె చుట్టూ ఒక వలయంలా ఏర్పడి ఆమె భద్రతను పర్యవేక్షిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇవాంకా సందర్శించాలని భావిస్తున్న చార్మినార్‌లోని గాజుల దుకాణం గురించి అమెరికా పోలీసులు ఆరా తీశారు. ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల వివరాలన్ని సేకరించారు. ఆమె భద్రత కోసం కొన్ని ప్రత్యేక అమెరికన్ పోలీసు బలగాలు కూడా హైదరాబాద్ రానున్నాయి.