Jongaon MLA Muthireddy Yadagiri Reddy: ఎమ్మెల్సీ పల్లాపై అంతెత్తు లేచిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
Jongaon MLA Muthireddy Yadagiri Reddy Slams MLC Palla Rajeshwar Reddy: జనగాం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి , బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జనగాం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఇరువురి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది.
Jongaon MLA Muthireddy Yadagiri Reddy Slams MLC Palla Rajeshwar Reddy: జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో ఆంధ్రా పాలకులకు అమ్ముడుపోతే సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు జనగామ నియోజకవర్గానికి వచ్చానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గుర్తుచేసుకున్నారు. 2009 నుండి నియోజకవర్గంలో భూస్థాపితం అయిన బీఆర్ఎస్ పార్టీని నాటి పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్యను సైతం 30వేల మెజారిటీతో ఓడగొట్టి గెలిపించుకొచ్చానని అన్నారు. అలాంటిది ఈ మధ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు సంచులతో జనగాం వచ్చి స్థానిక నాయకులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుండు అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మండిపడ్డారు.
ఆనాడు తాగు నీరు , సాగు నీరు లేక కరువు ప్రాంతంగా ఉన్న జనగామ ప్రాంతాన్ని చూసి సీఎం కేసిఆర్ కంట తడి పెట్టుకుండు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ సీఎం కేసిఆర్ సమావేశం పెట్టినా బచ్చన్నపేట ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటడు. మంత్రి హరీష్ రావు నిర్వహించిన రివ్యూలో మంత్రి నా పని తీరు అన్ని విధాలుగా మెరుగ్గా ఉంది, గతంలో కంటే రెట్టింపు మేజారితో గెలుస్తానని చెప్పిండు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు స్వార్థంతో 15 మంది ఎమ్మెల్యేలను పక్కలో బల్లెంల అమ్ముడు పోయినరు. పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు రాజకీయ చేష్టలు ముఖ్యమంత్రి సంకల్పానికి విరుద్ధం. వేరే పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని ముత్తిరెడ్డి యాదరిగి రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పడం ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలన దక్షతను కించపరిచినట్లే అవుతుందన్నారు. జనగామ నియోజకవర్గంలో ఉన్న నీ సంస్థల ద్వారా ఎంత మందికి ఉచిత విద్యను అందిస్తున్నావో చెప్పాలి అని ముత్తిరెడ్డి నిలదీశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో హైదరాబాద్ మల్లాపూర్ లోని నోమా ఫంక్షన్ హాల్లో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉచితంగా ఆశ్రయం కల్పించి భోజనం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న నీ ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎంత మందికి ఉచిత విద్యను అందించావో చెప్పాలని పట్టుబట్టారు. దొడ్డి కొమురయ్య వారసుడు శ్రీనివాస్ కు కూడా సీటు ఇవ్వకుండా పంపించిండు. ఎంపీపీ హోదాలో ఉన్న వ్యక్తులను కూడా కలవకుండా అవమానించిన చరిత్ర నీది. నియోజకవర్గం మీద, స్థానిక నాయకుల మీద సోయి లేని నువ్వు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తవా. రెండు సార్లు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా స్వంత ఖర్చులతో భోజనాలు పెట్టీ నిన్ను గెలిపించిన, కానీ 70 కోట్ల ఖర్చు పెట్టిన అని చెప్పడం సిగ్గు చేటు అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మండిపడ్డారు. నీ సోదరి కాలేజిలో ట్రస్ట్ మెంబరుగా స్థానం ఇస్తే, కాలేజీని కబ్జా చేస్తే మనస్థాపానికి గురైంది నిజం కాదా అని నిలదీశారు. స్వయంగా నీ సోదరి పసుపు కుంకుమలను దోచుకున్న నువ్వు రాజకీయాలు చేస్తావా అని ప్రశ్నించారు.
జనగాం నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులను డబ్బుతో ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే.. జనగాం నియోజకవర్గం కూడా మరో హుజూరాబాద్ గా మారుతుంది అని అటు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని సైతం హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఉద్యమ సమయంలో నీ పాత్ర ఏంటో చెప్పాలన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. ఉద్యమంలో ప్రాణ త్యాగాలకు వెనుకాడకుండా పోరాడి కేసుల పాలయ్యామని గుర్తుచేసుకున్నారు.
కబర్ధార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. నీ డబ్బు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నా.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ కబ్జా చేసిండో నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఉద్యమ సమయంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధమై ఢిల్లీని కూడా వణికించినం.. ప్రజల సాక్షిగా, సీఎం కేసిఆర్ సైనికుడిగా చెబుతున్నా.. తాను ఎవ్వరి భూమినైనా కబ్జా చేశానని నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సవాల్ విసిరారు.