మెదక్ పట్టణంలో నిర్వహించిన టీఆర్ఎస్ ఆశీర్వాద సభలో ప్రతిపక్ష  పార్టీలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేనికైనా తెగిస్తుందని.. తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబును తన బుజాలపై ఎక్కించుకొని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందన్నారు..పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి వెళ్తుందని ప్రజలకు కేసీఆర్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం అమరావతికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి పరిస్థితి వస్తుందన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తాము మళ్లీ ఆంధ్రవాసులకు బానిసలుగా మారాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.మహాకూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేసేది తెలంగాణ అభ్యర్ధి అయినప్పటికీ..పెత్తనం మాత్రం ఆంధ్రా ప్రాంత నేత చంద్రబాబు దగ్గర ఉంటుందని విమర్శించారు. కత్తి తెలంగాణదే..కానీ దాన్ని పట్టేవాడు ఆంధ్రావాడే వాడనే విషయం జనాలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారు తెలంగాణ సాధన సుదీర్ఘ ప్రయాణం
మెదక్ టీఆర్ఎస్ ఆశీశ్వారద సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాధించినప్పటికీ దాని ఫలాలు జనాలకు పూర్తి స్థాయిలో అందలేదని.. ఈ నాలుగేళ్ల పాలనలో కొంత వరకే సఫలమయ్యాం..ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది..అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి కష్టాల చాలా వరకు తీరాయి...మున్ముందు పూర్తి స్థాయిలో నీటి కష్టాలు తీరుస్తామన్నారు. ఏడాదిలోగా ప్రాజెక్టులు పూర్తి చేసి  కోటి ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యాన్ని చేధిస్తామన్నారు.


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చీకటే 
ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణలో కరెంట్ ఉండదని..రాష్ట్రం చీకటి తెలంగాణగా మారుతుందని భయపెట్టారు.. తీరా తెలంగాణ వచ్చాక దేశంలో ఎవ్వరూ చేయని విధంగా అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫర చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతులకు 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేస్తున్నాం. పరిశ్రమలు, ప్రజలకు ...రైతులు ఇలా అన్ని వర్గాలకు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రం చీకటి తెలంగాణగా మారుతుందని కేసీఆర్ హెచ్చరించారు.


పెట్టుబడి, గిట్టుబాటు ధర బాధ్యత తీసుకుంటా..
సంక్షేమం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దూసుకెళ్తోందని కేసీఆర్ వెల్లడించారు. కల్యాణలక్ష్మీ, రైతు రుణమాఫీ, ఇళ్ల నిర్మాణం, ఫించన్లు బడిపిల్లలకు సన్నబియ్యం ఇలా ఎన్నో పథకాలు అమలు చేసి పేదలకు తోడ్పాటునందించామన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి నాలుగు వేలు ఇస్తున్నాం... ఏడాదికి రూ.8 వేలు ఇచ్చాం. ఈ సారి అధికారంలోకి వస్తే ఎకరానికి రూ 5 వేలు ఇస్తాం.. సంవత్సరానికి ఎకరాకు 10 వేల ఇస్తామని ఈ సందర్భంగా  కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతు పెట్టుబడి దగ్గర నుంచి గిట్టుబాటు ధర వరకు అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి  కల్పిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన వేగంగా దూసుకెళ్తోంది. ఐటీ శరవేగంగా అభివృద్ధి  జరుగుతుందని కేసీఆర్ వెల్లడించారు