హైదరాబాద్: కొత్త మునిసిపల్ బిల్లు ప్రకారం పట్టణాల్లో 75 గజాల ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదని చెబుతూ జీ ప్లస్ 1 నిర్మాణాలకు సైతం అనుమతులు అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే, అదే సమయంలో అక్రమ నిర్మాణాలను నోటీసులు సైతం జారీ చేయాల్సిన అవసరం లేకుండానే కూల్చివేసే విధంగా కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగిందని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రాపర్టీ టాక్స్ ఏడాదికి కేవలం రూ.100 మాత్రమేనని, రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం రూ.1 మాత్రమే వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. మొత్తంగా భారత దేశమే తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా రాష్ట్రంలో నూతన సంస్కరణలను తీసుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.


అక్రమ కట్టడాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పలు సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలేసిందని, చేయని తప్పుకు ప్రభుత్వం మాటలు పడాల్సి వచ్చినప్పుడు తలదించుకోవాల్సిన దుస్థితి తలెత్తుతోందని ఆవేదన వ్యక్తంచేసిన కేసీఆర్.. అందువల్లే కఠినతరమైన చట్టాలు తీసుకొచ్చామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కొత్త మునిసిపల్ చట్టంపై చర్చ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ వ్యవస్థను అవినీతిరహితం చేయడానికే ఈ చట్టం తీసుకొస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఇక నుంచి నగర పంచాయతీలు ఉండవు. మునిసిపాల్టీలు, మునిసిపల్ కార్పొరేషన్స్ మాత్రమే ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.