కేవలం 2 సంవత్సరాలలో 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పడంతో పాటు బడ్జెట్‌లో మైనారిటీలకు పెద్దపీట వేయడం కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్‌కి మాత్రమే చెల్లిందని.. ఆయన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చేర్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ మైనారిటీల బడ్జెట్‌ను సాధ్యమైనంత మేర పెంచడానికి ప్రయత్నిస్తున్నారని, గతంలో కోటి రూపాయలున్న బడ్జెట్‌ను ఇప్పుడు రెండు వేల కోట్లకు ఆయన పెంచారని ఈ సందర్భంగా మహమూద్ అలీ తెలిపారు. ముఖ్యంగా దేశంలో మైనారిటీ విద్యకు ఎవరూ ఊహించని స్థాయిలో నిధులు కేటాయించడం కేవలం కేసీఆర్‌కి మాత్రమే చెల్లిందని.. అలాగే షాదీముబారక్ పథకం ద్వారా తెలంగాణలోని 87 వేలమంది మైనారిటీ ఆడపడుచులను ప్రభుత్వం ఆదుకుందని మహమూద్ అలీ పేర్కొన్నారు. 


అలాగే ఉర్దూ భాషను అభివృద్ది చేసేందుకు గాను ఉర్దూ అకాడమీకి తెలంగాణ ప్రభుత్వం రూ.40 కోట్లను మంజూరు చేయడం విశేషమన్నారు. అదేవిధంగా 45 వేల ఎకరాల వక్ఫ్‌భూములను రెవిన్యూ రికార్డులలో నమోదుచేసినట్టు చెప్పారు. అలాగే  ఇమామ్‌లకు నెలకు రూ.1500 గౌరవవేతనం ఇవ్వడం కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే సంభవమైందన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌కు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు, రూ.7 కోట్లతో సిక్కుభవన్, క్రిస్టియన్‌భవన్, జామేనిజామియాలో రూ.14.60 కోట్లతో మైనారిటీల కోసం ఆడిటోరియంను కూడా ప్రభుత్వం ఏర్పాటు తనకు సంతోషాన్ని కలిగిస్తుందని మహమూద్ అలీ అన్నారు