హైదరాబాద్ నట్టనడి మధ్యలో ఉండే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజవర్గ టీఆర్ఎస్ టికెట్ దానం నాగేందర్ కు కేటాయించినట్లు సమాచారం. ఈ మేరకు నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలని పార్టీ నాయకత్వం దానంకు సూచినట్లు తెలిసింది. గత ఎన్నికలో ఈ స్థానాన్ని బీజేపీ అభ్యర్ధి చింతల రామచంద్రారావు కైవసం చేసుకోవడం..పీజేఆర్ కుటుంబం ఆ నియోజకవర్గంపై పట్టుకోల్పోయింది. ఈ స్థానంలో మళ్లీ రామచంద్రారావు పోటీ చేస్తుండంతో ఆయనకు దానం దీటైన అభ్యర్ధిగా భావించిన కేసీఆర్.. ఆయనకు ఈ సీటు కేటాయించినట్లు తెలిసింది. తొలుత బీజేపీ సిట్టింగ్ స్థానమైన గోషామహల్ ను ఇవ్వాలని భావించినా..దానం కోరిక మేరకు ఖైరతాబాద్ నే ఖరారు చేసినట్టు తెలుస్తోంది


దివంగత పీజేఆర్ కంచుకోటగా ఉన్నఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన టికెట్ ను ఆయన కుమార్తె విజయారెడ్డి ను కాదని దానం కేటాయించడం పట్ల పీజేఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. ఈ క్రమంలో టీఆర్ఎస్ తో తాడే పేడో తేల్చుకునేందుకు విజయారెడ్డి హుటాహుటిన మంత్రి కేటీఆర్ ను కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేయగా.. ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానాన్ని వదులుకునేందుకు విజయారెడ్డి ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా  వేడెక్కింది.