Komatireddy Venkat Reddy comments on Huzurabad by-poll results: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే ఫలితాల సరళిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం ప్రకారం తమ శత్రువుకు శత్రువైన ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని బహిరంగంగానే ప్రకటించి అటు పార్టీకి, ఇటు ప్రజలకు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయేవని.. అదే కానీ జరిగితే అది టీఆర్ఎస్ పార్టీకి మేలు చేకూర్చుతుందనే కారణంతోనే తాము కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చిందని కోమటిరెడ్డి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అందుకే ఈటల రాజేందర్‌కు (Eatala Rajender) పరోక్షంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారంరేపుతున్నాయి.


హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని భావించిన టీఆర్ఎస్ పార్టీ.. ఐదు నెలల్లోనే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంలో మద్యం ఏరులై పారిందని తెలిపారు. ఏదేమైనా టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ ఓటర్లు షాక్ ఇవ్వనున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. 


హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓటమికి తానే బాధ్యత తీసుకుంటానంటూ ఓవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటిస్తుండగా.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం తామే ఈటల రాజేందర్‌కి సహకరించాల్సి వచ్చిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించడం పార్టీలో పెనుదుమారం రేపుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy on Komatireddy comments), పార్టీ అధిష్టానం ఏమని స్పందిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.