Komatireddy Venkat Reddy Attack: యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డిపై దుర్మార్గంగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు క్షమించరాదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వెంకట్‌రెడ్డి తీరును తప్పుబట్టారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారం, అహంకారంతో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అహంకారంతో అడ్డగోలుగా జెడ్పీ చైర్మన్‌పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరిపై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమని చెప్పి కోమటిరెడ్డి తన అహంకారాన్ని బయట పెట్టుకున్నారని గుర్తుచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం లేకుండాపోయిందని కేటీఆర్‌ విమర్శించారు. నియంతృత్వ ధోరణిలో పని చేస్తోందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులపైన కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకొని తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి అండగా ఉంటుందని ప్రకటించారు.


ఫోన్‌లో పరామర్శ
యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సందీప్‌ రెడ్డి దాడి విషయమై తెలుసుకున్న కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డితో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కోమటిరెడ్డి అరాచకపు వ్యవహారంలో గట్టిగా నిలబడి, నిలదీసిన సందీప్ రెడ్డిని అభినందించారు. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో కిందిస్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎవరికి ఇబ్బందులు ఎదురైనా 60 లక్షల మంది కార్యకర్తల బలగం ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబం భరోసాగా నిలబడుతుందని సందీప్‌రెడ్డికి కేటీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గ పూరిత వ్యవహారాలకు దిగినా, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు అయ్యేదాకా ఇలాగే కొట్లాడుదామని సందీప్ రెడ్డితో కేటీఆర్ అన్నారు.


వివాదం ఇది..
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి హాజరయ్యారు. ప్రొటోకాల్‌ ప్రకారం సందీప్‌ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పక్కనే కూర్చున్న సందీప్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. లేచి కోమటిరెడ్డి మాటలను ఖండిస్తుండగా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో కొట్టుకునే స్థాయికి చేరింది. పోలీసులు వెంటనే సందీప్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించి వేశారు.

Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు
 


Also Read: RS Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook