KT Rama Rao: శ్రీధర్ రెడ్డి హత్యపై కేటీఆర్ ఫైర్.. ఇలాంటివి మళ్లీ జరిగితే రేవంత్ రెడ్డి తట్టుకోలేవు
KT Rama Rao Attends BRS Party Leader Sridhar Reddy Last Cremation In Kollapur: కాంగ్రెస్ అధికారంలోకి రాష్ట్రంలో హత్యలు, దాడులు చోటుచేసుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పునరావృతమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు.
KT Rama Rao In Kollapur: తెలంగాణలో హత్యా రాజకీయాలు కొనసాగడంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొల్లాపూర్‌లో చోటుచేసుకుంటున్న పార్టీ కార్యకర్తల దారుణహత్యలపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేరుకు ప్రజాపాలన కానీ.. ప్రతీకార పాలన చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. తమ పార్టీ నాయకుడు సుధీర్ రెడ్డి హత్యకు బాధ్యత వహిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతిని కొనసాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Also Read: Brutally Murder: తెలంగాణలో మరో రాజకీయ హత్య.. మంచంపై పడుకున్న నాయకుడిపై క్రూరంగా దాడి
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. చిన్నంబావి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో హత్యకు గురయిన విషయం తెలుసుకున్న కేటీఆర్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి అక్కడకు వెళ్లాడు. వనపర్తి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం చిన్నంబావి నుంచి లక్ష్మీపూర్ గ్రామం వరకు కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సుధీర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
Also Read: Women Sits In Pothole: రోడ్డు సమస్యపై మౌన నిరసన.. బురదలో కూర్చున్న మహిళ
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 'మాజీ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బొడ్డు శ్రీధర్‌ను హత్య చేశారు. కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావుదే ఈ హత్యకు బాధ్యత. ఇక్కడ ఇది మొదటి హత్య కాదు. నాలుగు నెలల్లోనే ఇద్దరిని హత్య చేశారు. గతంలో మల్లేశ్ యాదవ్, ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని పొట్టన బెట్టుకున్నారు. పేరుకేమో ప్రజాపాలన.. కానీ చేస్తున్నది ప్రతీకార పాలన' అని తెలిపారు.
'ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు పలకని వాళ్లను ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన ఇది. ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిందే' అని కేటీఆర్ అల్టిమేటం జారీ చేశారు. జూపల్లి కృష్ణారావు ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొచ్చాడు. నాలుగు నెలల్లోనే రెండు హత్యలు జరిగాయంటే కచ్చితంగా దీని వెనుక మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోద్బలం ఉంది. లేదంటే ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు' అని కేటీఆర్ తెలిపారు.
'రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జూపల్లిని మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి. స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం వేయాలి. లేకపోతే న్యాయ విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వం, మంత్రి పాత్ర లేకపోతే నిష్పాక్షపాత విచారణకు ప్రభుత్వం సహకరించాలి' అని కేటీఆర్ కోరారు. కొల్లాపూర్‌లో కొత్తగా హింసాయుత సంస్కృతిని తీసుకురావడంపై తమ పార్టీ నాయకులు డీజీపీని కలిసి విన్నవించినట్లు గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దాడులు చేస్తూ చెలరేగిపోతున్నారని.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
'కొల్లాపూర్‌ను పికెట్‌లు, క్యాంప్ పెట్టిలు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. హత్య జరిగిన తర్వాత పది నిమిషాల్లో రావాల్సి ఉండగా గంటన్నర తర్వాత వచ్చి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు' అని కేటీఆర్ ఆరోపించారు. స్థానిక ఎస్సైని సస్పెండ్ చేయాలని, బాధ్యులైన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'ప్రతీకారంతో మా కార్యకర్తలను హత్య చేయటం, గొంతు నొక్కటం చేస్తూ బలపడదాం అనుకుంటే అది ముఖ్యమంత్రి మూర్ఖత్వం, కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది' అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు కొనసాగుతూ ఉంటే మా కార్యకర్తలను అదుపు చేయటం కూడా సాధ్యం కాదని హెచ్చరించారు. ఇలాంటి సంస్కృతి కచ్చితంగా తెలంగాణకు మంచిది కాదని హితవు పలికారు.
'కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇలాంటి సంఘటనలు ఏనాడూ జరగలేదు. ఇలాంటి హత్యలు, దారుణాలకు వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మేము తిరగబడతాం. ఢిల్లీలో రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్?' అని ప్రశ్నించారు. 'హత్యలు, దాడులు, ప్రతిపక్షాల పై కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరింపులు, బైండోవర్లు. ఇవేనా కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు. ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు, ఎవరికీ మంచిది కాదు' అని హెచ్చరించారు. శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter