KTR Confidence: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. గతం కంటే అత్యధికంగా స్థానాలు గెలుపొందేందుకు భారీ వ్యూహం రచించింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న గులాబీ దళం ఎన్నికల్లో గెలవబోయే స్థానాలపై ఒక నిర్ధిష్ట సర్వే నిర్వహించింది. ఈ ఎన్నికల్లో గెలిచే స్థానాలపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఓ అంచనా వేశారు. తాజాగా సిరిసిల్ల నియోజకవర్గంపై జరిగిన సమావేశంలో కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరిక


 


పార్లమెంట్‌ ఎన్నికల్లో గతంలో కన్నా అత్యధిక స్థానాలు గెలుపొందుతామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం కూడా కారుదే గెలుపు అని చెప్పారు. సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి కార్యకర్తలతో సోమవారం కేటీఆర్‌ సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మే 10వ తేదీన సిరిసిల్లలో జరిగే కేసీఆర్ రోడ్ షో నిర్వహణపై పార్టీ శ్రేణులతో చర్చించారు.

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు


 


ఈ సమావేశంలో కేటీఆర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల పక్షాన కొట్లాడుదాం.. బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో నమ్మకం పోయిందని చెప్పారు. బండి సంజయ్‌పై వ్యతిరేకత ఉందని, ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్, బీజేపీలు చేసిన మోసాలపై చర్చించాలని సూచించారు. ప్రజల సమస్యలే ఎజెండాగా, కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని పిలుపునిచ్చారు.


అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాలో కాంగ్రెస్ చాలాచోట్ల విజయం సాధించిందని కేటీఆర్‌ వివరించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయకపోతే ఫ్రీ బస్సు తీసేస్తాం అంటున్నారని, ప్రజలు ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.


బీజేపీ కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల, కళాశాల తీసుకొచ్చాడా, గుడి, పరిశ్రమ ఏమైనా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ఒక్క రూపాయి పని చేయని బండి సంజయ్‌కు ఓట్లు అడిగే అర్హత లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏమి చేయని బీజేపీకి, కరీంనగర్‌కు నయా పైసా పని చేయని బండి సంజయ్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజల్లో చర్చ పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter