KT Rama Rao: నాకు ఉరిశిక్ష పడ్డట్టు కాంగ్రెసోళ్ల సంబరాలు ఎందుకు? నేను అవినీతి చేయలేదు
KT Rama Rao Press Meet: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. న్యాయం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
KT Rama Rao: ఫార్ములా ఈ కారు కేసులో క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేయడంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేవలం క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టివేసింది. నాకు ఉరిశిక్ష పడ్డట్టు కాంగ్రెస్ మంత్రులు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు అంత సంతోషం' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాను న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఫార్ములా ఈ కారు రేసులో తాను ఎలాంటి అవినీతి పాల్పడలేదని పునరుద్ఘాటించారు.
Also Read: KT Rama Rao: క్వాష్ పిటిషన్ రద్దుపై కేటీఆర్ సంచలన ట్వీట్.. 'నా నోరు మూయించలేరు'
హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కక్ష సాధింపు కేసు అని తెలిసినా విచారణకు హాజరైనట్లు కేటీఆర్ తెలిపారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నాపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనబడుతుందని చెప్పారు. నాకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు వినియోగించుకుంటానని ప్రకటించారు.
Also Read: KT Rama Rao: మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా: కేటీఆర్
సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'నా హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిలా విచారణకు హాజరయ్యా. విచారణకు న్యాయవాదులతో రావొద్దని చెబుతున్నారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించా. హైకోర్టు ఆదేశానుసారం ముందుకువెళ్తా. ఈడీ విచారణకు కూడా హాజరవుతా' అని కేటీఆర్ వివరించారు.
కొందరు మంత్రులకు ఉలుకు పాటు ఎందుకో.. అర్థం కావడం లేదని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ కీర్తిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకు వెళ్లేందుకు పని చేసినట్లు ప్రకటించారు. మీరు ఏ విచారణకు రమ్మన్నా వస్తానని చెప్పారు. కొంత మంది ఏదో జరిగిపోయిందని శునకానందం పొందుతున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. 'ఫార్ములా ఈ కేసుపై 4 కోట్ల ప్రజల ముందు అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పారిపోయారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే నీ ఇంట్లో లైవ్ కెమెరాల ముందు దీనిపై చర్చకు పెట్టు. నేను సిద్ధం' అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇది చేస్తోందని పునరుద్ఘాటించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై నమ్మకం ఉందని.. ఇది అనుముల రాజ్యాంగం కాదని స్పష్టం చేశారు.
గ్రీన్‌కో విరాళాలపై
'బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే. మేఘా కంపెనీ ఎలెక్టోరల్ బాండ్ ఇచ్చినందుకే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఇచ్చారా? క్విడ్ ప్రొకో అంటే వీరికి అర్థం తెలుసా? గ్రీన్ కో కంపెనీ ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. కాంట్రాక్టర్ మంత్రి, బ్రోకర్ ముఖ్యమంత్రి మాటలు ఇంతకంటే ఎలా ఉంటాయి' అని కేటీఆర్ తెలిపారు. తమపై కేసులకు ఇది ఆరంభం మాత్రమే.. అన్నిటినీ ఎదుర్కుంటామని కేటీఆర్ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.