KT Rama Rao: మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా: కేటీఆర్

KT Rama Rao Slams To Revanth Reddy ACB Investigation: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న తమను అపేందుకు.. రైతు భరోసాపై కాంగ్రెస్ చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 6, 2025, 11:06 PM IST
KT Rama Rao: మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా: కేటీఆర్

KT Rama Rao vs Revanth Reddy: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగుతున్న తమను నియంత్రించేందుకు.. రైతు భరోసా పై చేసిన మోసాన్ని కప్పిపుచ్చడానికే రేవంత్‌ రెడ్డి కుట్ర చేస్తున్నాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పాలన చేతగాక ఏసీబీతో తనను వేధించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తన సొంత రాజ్యాంగాన్ని అమలుచేయాలన్న దురాలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు.

Also Read: K Kavitha: పాలన చేతగాక రేవంత్‌ రెడ్డి మా అన్న కేటీఆర్‌పై కుట్రలు

ఫార్ములా ఈ కారు కేసులో ఏసీబీ విచారణకు పిలవడంతో బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన కేసులో విచారణకు పిలవడం అంటే భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని విమర్శించారు. తన సొంత రాజ్యాంగాన్ని అమలుచేయాలనే దురాలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.

Also Read: Zoo Park Flyover: రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం.. జూపార్క్‌ ఫ్లైఓవర్‌కు మన్మోహన్‌ సింగ్‌ పేరు

గతంలో తమ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని విచారణ పేరుతో పిలిచి ఆయన ఇవ్వకున్నా అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్‌ని మీడియాకి వదిలారని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అలాగే చేసే అవకాశం ఉండడంతో న్యాయవాదులతో కలిసి విచారణకు వెళ్లాలనుకున్నట్టు వివరించారు. 'నావెంట న్యాయవాదులు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య ఏమిటో చెప్పాలి. ఒక పౌరుడిగా న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు తనకు లేదనే విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి' అని కేటీఆర్‌ ఏసీబీ అధికారులను డిమాండ్ చేశారు.

విచారణ పేరుతో పిలిచి తన ఇంటిపైన అక్రమంగా దాడులు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని ఆరోపించారు. 'రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తన ఇంట్లో చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచేందుకు కుట్ర కూడా జరుగుతోంది. ఎన్ని దాడులు చేసినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై  పోరాటం ఆపేది లేదు' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు' అని తెలిపారు. 

'రైతు భరోసా కోత విధించి రైతులకు చేసిన నమ్మక ద్రోహం నుంచి ప్రజల దృష్టి మరలించే అటెన్షన్ డైవర్షన్ స్కీంలో భాగమే ఈ ఏసీబీ విచారణ. ఇలా ఇచ్చిన అనేక హామీలు అమలు చేయలేక అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడు కావున డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు' మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇచ్చిన  హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ఎవరైతే విమర్శిస్తున్నారో వారిని అరెస్టు చేయడమే రెండో పనిగా పెట్టుకున్నాడని.. అయితే ఎన్ని అటెన్షన్ డైవర్షన్‌లు చేసినా ప్రభుత్వ వైపల్యాలను ఏండగడుతూనే ఉంటామని కేటీఆర్‌ ప్రకటించారు.

Trending News