KT Rama Rao: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, గంగుల కమలాకర్‌ తదితరులు పొలంబాట పట్టారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో రేవంత్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి చేసిన విమర్శలపై కేటీఆర్‌ తిప్పికొట్టారు. తాగు, సాగునీటి విషయాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Fire:కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌


హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైంది. ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు రోడ్ల పైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడు' అని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదని విమర్శించారు. ఢిల్లీకి డబ్బు సంచులు పంపడంపైన దృష్టి పెట్టారని ఆరోపించారు.

Also Read: Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌


పదేళ్లలో తమ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏరోజు తాగునీటి ఇబ్బందులు రానియ్యలేదని కేటీఆర్‌ చెప్పారు. 50 ఏళ్ల పాటు హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చేసినట్లు గుర్తుచేశారు. కేసీఆర్  ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాద్‌లో ట్యాంకర్ల హడావిడి, రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా స్టార్ట్ అయిందని వివరించారు. ప్రకృతి వల్ల వచ్చిన తాగునీటి కొరత కాదని.. కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల వచ్చిన కొరత అని స్పష్టం చేశారు.


'ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి.. వాటిని నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు . వాటర్ ట్యాపింగ్‌పైన దృష్టి పెట్టండి' అని రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ హితవు పలికారు. నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్‌లో నీళ్లు ఉన్నా ప్రజలు ఎందుకు ట్యాంకర్లు బుక్ చేసుకోవాలని ప్రశ్నించారు.


తాగునీరు కోసం ఢిల్లీ ముందు భిక్షం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద రాజకీయ కక్షతోని కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ప్రయత్నం చేసిందని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే మళ్లీ పంప్ హౌస్‌లు ఎట్లా ప్రారంభమైనయ్.. నీళ్లు ఎట్ల ఎత్తిపోస్తున్నారని నిలదీశారు. నీళ్లు ఉండి కూడా పంటలు ఎండబెట్టిన చరిత్ర రేవంత్‌ రెడ్డి. పంట పండితే బోనస్ ఇవ్వాలనే భయంతోనే పంటలను కాంగ్రెస్ పార్టీ ఎండబెట్టిందని తెలిపారు. హైదరాబాద్ కాంగ్రెస్‌కి ఓటు వేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కక్ష కట్టారని చెప్పారు.


ఫోన్‌ ట్యాపింగ్‌పై లీగల్‌గా చర్యలు
నాకు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. '2011 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలు అన్ని బయటపెట్టాలి. తెలంగాణ ఉద్యమంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇప్పుడున్న అధికారులే. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్‌ మీద ఆధారాలు తిస్తే ఎవరి బొక్కలు ఏంటో తెలుస్తాయి' అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక ఖాయం
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరి మళ్లీ పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఈ మధ్యనే స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక ఖాయమని ప్రకటించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి