హైదరాబాద్: ఇటీవల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం తీవ్ర కృషి చేసి, పార్టీ విజయంలో కీల‌క పాత్ర పోషించిన సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌కు పార్టీలో ప్రమోషన్ లభించింది. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియామక ఆదేశాలు జారీచేశారు. 2018 ఎన్నికల తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలపై దృష్టిసారిస్తూ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషిచేస్తానని గతంలోనే ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందులో భాగంగానే తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కేటీఆర్ చేతుల్లో పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం రెండోసారి వచ్చిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి, రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వకారం చేసిన కేసీఆర్... ఆ మరుసటి రోజే తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. 


కేబినెట్ ఏర్పడిన తర్వాత కేబినెట్‌లోనూ కీలక పదవి దక్కించుకోనున్న కేటీఆర్.. ఆ తర్వాత పార్టీ సంస్థాగత, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కీలక పాత్ర పోషించనున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టిసారించే క్రమంలో తనపై పని ఒత్తిడిని తగ్గించుకునేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.