హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఇద్దరికే దక్కిందని.. అందులో ఒకరు ఎన్టీఆర్‌ కాగా... మరొకరు కేసీఆర్‌ అని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామా రావు అన్నారు. అయితే, ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని స్థాపించినప్పుడు, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పటి పరిస్థితులు రెండూ వేర్వేరుగా ఉన్నాయని చెబుతూ ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత నెలకొందని, ఎన్టీఆర్‌ స్టార్ హీరో కావడంతో‌ ఆయనకు ఎన్నో అంశాలు అనుకూలించాయని అన్నారు. కానీ కేసీఆర్‌ విషయంలో అలా జరగలేదని.. ఎలాంటి అనుకూలతలు లేకుండానే కేసీఆర్ పార్టీని స్థాపించి విజయం సాధించారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సం సందర్బంగా శనివారం టీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికలతోపాటు త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుపు టీఆర్ఎస్‌దే అవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.