Minampalli Hanmantha Rao: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఆయన కొడుకు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరి నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నక్క ప్రభాకర్ కూడా వారితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంత రావు మీడియాతో మాట్లాడుతూ, " తాను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మెదక్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తాను బీఆర్ఎస్ పార్టీలో చేరి గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలోనే దేశంలోనే అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గంగా పేరున్న మల్కాజిగిరి నుండి పోటీ చేసి కేవలం 27 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైన సందర్భాన్ని మైనంపల్లి హన్మంత రావు గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ తాను బీఆర్ఎస్ పార్టీకి సేవ చేయడంలో తాను ఏనాడు వెనుకడుగు వేయలేదని.. ఆ తరువాత అదే మల్కాజిగి నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యానని.. గ్రేటర్ హైదరాబాద్ లో తానే అత్యధిత మెజార్టీతో విజయం సాధించానని అన్నారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి మినీ ఇండియాగా పేరుందన్న మైనంపల్లి హన్మంత రావు.. దేశం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుండో జనం వచ్చి ఇక్కడ జీవిస్తుంటారని.. అలాంటి లక్షలాది మంది స్థానికేతరులు ఉన్న ప్రాంతం కావడంతో ఓటర్లను ఆకట్టుకోవడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయని.. అయినప్పటికీ అవన్నీ లెక్క చేయకుండా సవాళ్లను అన్నింటినీ అధిగమిస్తూ తాను ఎక్కడున్నా ఆ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వచ్చానని అన్నారు.


బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు పార్టీ కార్యకర్తలు, స్థానికుల నుండి సహకారం లభిస్తుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు మైనంపల్లి హన్మంత రావు స్పందిస్తూ.. తాను ఎక్కడున్నా పార్టీలతో సంబంధం లేకుండా తన కేడర్ తనతోనే ఉందని.. కార్యకర్తలు కూడా తన వెన్నంటే ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు. అంతేకాకుండా తాను ఏ పార్టీలో ఉన్నానో.. అక్కడ తన మార్క్ చూపించుకునేలా పనిచేసుకుపోతానని అన్నారు. 


మైనంపల్లి హన్మంత రావు మాటల్లో విశ్వాసం చూస్తోంటే.. ఆయన వీడి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి తన ప్రభావం తెలిసేలా పనిచేస్తానని ఆయన చెప్పదల్చుకున్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. మైనంపల్లి హన్మంత రావు, ఆయన కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చేరిక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు నెలల క్రితం వరకు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గా కొనసాగి, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్లీ ఇటీవలే సొంత గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈమధ్యే హైదరాబాద్‌లో తన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనిల్ కుమార్ రెడ్డిని కూడా ఇదే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో కల్పించారు.