Minister Harish Rao to Telangana Governor Tamilisai Soundararajan: హైదరాబాద్: దాసోజు శ్రవణ్‌ కుమార్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ నిర్ణయం తీసకకోవడం దారుణం అని మంత్రి హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారు. వారు తమతమ రంగాల్లో ప్రజలకు మేలుచేసే అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అలాంటి నేతలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వారికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తే.. గవర్నర్‌ వారిద్దరు బీఆర్‌ఎస్‌ పార్టీలో సభ్యులుగా ఉండడం వల్ల అనర్హులు అనడం దారుణమని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి హరీశ్ రావు ఈ అంశంపై మాట్లాడుతూ, " ఒకవేళ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు బీఆర్ఎస్ పార్టీ నేతలు అవడం వల్లే వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినట్టయితే.... తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు ? పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర గవర్నర్‌ పదవి ఇవ్వవచ్చా ? సర్కారియా కమిషన్‌ ప్రతిపాదనలను బట్టి చూస్తే గవర్నర్‌ పదవిలో తమిళిసై ఉండవద్దు.. మరి ఆమె ఎలా ఉన్నారు " అని ప్రశ్నించారు. 


బీజేపీ పార్టీకి చెందిన గులాం అలీ ఖతానాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా..? బీజేపీ నేత మహేశ్‌ జఠ్మలానీ, సోనాల్‌ మాన్‌సింగ్‌, రాంషఖల్‌, రాకేశ్‌ సిన్హా.. ఇలా వీళ్లంతా బీజేపీలో పనిచేయలేదా..? వీరిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎలా నియమించారు అంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ని మంత్రి హరీశ్ రావు నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో జితిన్‌ ప్రసాద్‌, గోపాల్‌ అర్జున్‌ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్‌, రజనీకాంత్‌ మహేశ్వరీ, సాకేత్‌ మిశ్రా.. హన్స్‌రాజ్‌ విశ్వకర్మ.. ఇలా అనేక మందిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. వీరంతా బీజేపీ పార్టీలో ప్రత్యక్షంగా ఉన్నవారే కదా..? అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం.. బీజేపీతో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా..? కేంద్ర ప్రభుత్వానికి ఒక నీతి.. బీజేపీయేతర రాష్ట్రాలకు మరోనీతి ఉంటుందా అని మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. 


తెలంగాణ విషయంలో గవర్నర్‌ వైఖరిలో మార్పు లేదు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తే గవర్నర్‌ సరిచేస్తే ఏమో అనుకోవచ్చు.. కానీ, నీతి, నిజాయితీతో పనిచేస్తే కూడా గవర్నర్‌ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లులను ఆపారు. రెండేసిసార్లు బిల్లులను పంపినా వాటిని ఆమోదించలేదు. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం మరీ దారుణం. తెలంగాణ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు అంటూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై మంత్రి హరీశ్ రావు తన అసహనాన్ని వెళ్లగక్కారు.