హైదరాబాద్: #AskKtr (ఆస్క్ కేటీఆర్) అనే హ్యష్ ట్యాగ్‌తో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు నెటిజెన్స్‌తో కాసేపు సరదాగా చిట్ చాట్ చేశారు. రాష్ర్టంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు నుంచి ఏపీలో జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు, ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన వరకు అనేక కీలక అంశాలు ట్విటర్‌లో చర్చకొచ్చాయి. ముఖ్యంగా తెలంగాణలో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ హిందూ- ముస్లిం కమ్యూనల్ కార్డుని వాడుతుందన్న ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. ''తెలంగాణ ప్రజలను విభజించే ఎలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివి తెలంగాణ ప్రజలకు ఉంది'' అని బదులిచ్చారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం శాంతియుతమైనదని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ స్పందన.. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరు నెలల పాలన ఒక మంచి ఆరంభంగా అభివర్ణించిన మంత్రి కేటీఆర్.. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు మంచి పరిణామమా కాదా అనేది ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. 


కేంద్రం సమాధానం చెప్పాల్సిందే..
దేశంలో అర్ధికాభివృద్ది, ద్రవ్యోల్బణం, నిరుద్యోగితపైన కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందే.


అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు..
తనను అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్ గారేనని ప్రకటించిన మంత్రి కేటీఆర్. 


అది ఎప్పటికీ ఒక మంచి జ్ఞాపకం..
2019 సంవత్సరంలో అన్ని జిల్లా పరిషత్‌లను గెలుచుకోవడం ఎప్పటికీ ఒక మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుంది.


రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుంటేనేం..
రాష్ర్టంలో బలమైన ప్రతిపక్షం లేకున్నా, తమకున్న 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పని తీరుపై తమకు అవసరమైన ఫీడ్‌బ్యాక్ లభిస్తూనే ఉంది.


మంత్రి పదవికన్నా అదే ముఖ్యం..
టీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్లే తనకు మంత్రి పదవి దక్కిందన్న మంత్రి కేటీఆర్.. మంత్రి పదవి కన్నా తనకు పార్టీలో ఉన్న పదవే విలువైందని అన్నారు.


హైదరాబాద్ నగర అభివృద్ధిపై..
హైదరాబాద్‌లో నగర అభివృద్ధి అనేది ఓ నిరంతర ప్రక్రియ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన మంత్రి కేటీఆర్.. భవిష్యత్తులోనూ ఆ ప్రక్రియ అలాగే కొనసాగుతుందని తెలిపారు. పాతబస్తికీ మెట్రో రైలు, బిఅర్‌టియస్ కోసం ప్రణాళికలు ప్రారంభం 111 జీవోపై ఉస్మాన్ సాగర్ హిమాయత్‌సాగర్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. 2020లో ఫార్మాసిటీ ప్రారంభం, 2020 మొదటి అర్ధ సంవత్సరంలో రెండవ దశ టిహబ్‌ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. టీ వర్క్స్ నూతన మున్సిపల్ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిన మంత్రి కేటీఆర్.. మునిసిపల్ శాఖ అధికారులతో నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేయడం జరుగుతుందని స్పష్టంచేశారు.