నల్గొండ: తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కట్టంగూరు మండలం నారెగూడెంలో ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఊహించని విధంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలోకి ప్రచారానికి వచ్చిన చిరుమర్తి లింగయ్యను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచి పార్టీ మారడంపై తీవ్ర నిరసన తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరవర్గానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. 


గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో చివరికి లింగయ్య ప్రచారంలో పాల్గొనడకుండానే వెనుదిరిగాల్సిన పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తమ నిరసనను తెలియజేసి వారికి బుద్ధి చెప్పాలని టీపీసీసీ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా ఆందోళన నిర్వహించారు.