హైదరాబాద్‌లో చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి భూకబ్జాలు చేసి కోట్లు సంపాదించిన గ్యాంగస్టర్ నయీమ్‌ను అంతమొందించింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని.. ఆ పని చేయించింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు సీబీఐ ముందుకు వచ్చినప్పుడు..  నయీమ్‌ మీద కూడా ఎంక్వయరీ జారీ చేశారని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నయీమ్‌‌కు ఎందరో జాతీయ రాజకీయ నాయకులతో పాటు పోలీసులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని.. నయీమ్‌ చనిపోకపోతే.. ఎందరో జాతీయ నాయకుల పేర్లు బయటకు వచ్చేవని నారాయణ ఆరోపించారు. అందుకే బీజేపీ నేత అమిత్ షా ఓ పథకం ప్రకారం నయీమ్‌‌ను ఎన్ కౌంటర్ చేయించారని తెలిపారు. 


భువనగిరిలో  నయీం భాదితులకు న్యాయం చేయాలని కోరుతూ వామపక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ నేత నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.  నయీం కేసులో జాతీయ నాయకులతో పాటు కేసీఆర్, డీజీపీల పాత్ర కూడా ఉందని.. అందుకే కేసును సిట్‌కు అప్పగించి మీనమేషాలు లెక్కబెడుతున్నారని నారాయణ అభిప్రాయపడ్డారు.


ఆ విషయంపై తామెప్పుడో హైకోర్టులో వ్యాజ్యం వేశామని..  నయీం వద్ద లభించిన డైరీలో ఎన్నో ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయని.. మరి వాటిని ఎందుకు బహిర్గతం చేయడం లేదని.. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు.