తెలంగాణకు షాక్ ఇచ్చిన మోదీ సర్కార్
తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులలో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ఎంపీ వినోద్ లేఖపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరి స్పందించారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు తర్వాత.. ఏ ఇతర ప్రాజెక్టుకి కూడా జాతీయ హోదా ఇవ్వడం కుదరదని నితిన్ గడ్కరి అన్నారు.
గడ్కరి జవాబు తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఈ సందర్భంగా ఎంపీ వినోద్ తెలిపారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.20 వేల కోట్లు సహాయం చేయాలని కోరిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,000 ఎకరాలు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది.
ఇటీవలే ప్రధాని మోదీని కలిసిన కేసీఆర్ 11 వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో హైకోర్టు విభజనను వేగిరంగా పూర్తి చేయాలని, అలాగే కొత్త జోన్ల విధానానికి మోదీ సర్కారు ఆమోదం తెలపాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. వీటితో పాటు తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వచ్చేలా చూడాలని కూడా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.