తెలంగాణలో నాలుగు ప్రధాన ప్రతిపక్ష పార్టీల బృందం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. మంగళవారం నరసింహన్‌తో భేటీ అయిన ఈ బృందం ఎన్నికలయ్యే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ బృందంలో తెలుగుదేశం పార్టీ (టిడిపి), కాంగ్రెస్, తెలంగాణ జన సమితి (టిజెఎస్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ బృందం ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరగాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది.


గవర్నర్‌ను కలిసిన అనంతరం మాజీ టిడిపి ఎమ్మెల్యే ఆర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, "మా ప్రతినిధి బృందం సభ్యులు నేడు గవర్నర్‌ను కలిశారు. ప్రస్తుత ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని చెప్పాము. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించక ముందే కేసీఆర్ ఎలక్షన్ షెడ్యూల్‌ను ప్రకటించారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అందువల్ల గవర్నర్‌ను కలిశామని, రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు రాష్ట్ర పరిపాలన భాధ్యతను గవర్నర్ తీసుకోవాలని కోరాము' అని అన్నారు.


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశ వివరాలను వెల్లడిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని ఆరోపించారు. 'ఆపర్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయించారు. ముఖ్యమంత్రిని తొలగించాలని, రాష్ట్రపతి పాలన విధించాలని కోరాము' అని అన్నారు.


సెప్టెంబరు 6న  కే.చంద్రశేఖరరావు నేతృత్వంలోని క్యాబినెట్ సిఫార్సుల పేరుకు గవర్నర్ నరసింహన్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్‌ను ఆపర్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు.