నేరెళ్ల వేణుమాధవ్ ప్రత్యేక పోస్టల్ కవర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో భారత తంతితపాలాశాఖ ఒక ప్రత్యేక స్టాంప్ కవర్ ను విడుదల చేసింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో భారత తంతితపాలాశాఖ ఒక ప్రత్యేక స్టాంప్ కవర్ ను విడుదల చేసింది. మిమిక్రీకి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా.. అంకితమిస్తూ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. ఈ ప్రత్యేక పోస్టల్ కవర్ ను తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్ అబిడ్స్ లోని జనరల్ పోస్ట్ ఆఫీస్(జీపీవో)లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి నేరెళ్ల వేణుమాధవ్ దంపతులను ఆహ్వానించారు. వీరి సమక్షంలోనే పోస్టల్ కవర్ ను విడుదల చేశారు. అనంతరం నేరెళ్ల దంపతులకు పోస్టల్ అధికారులు శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
వరంగల్ కు చెందిన నేరెళ్ల వేణుమాధవ్ డిసెంబర్ 28న 85వ వడిలోకి అడుగుపెడతారు. ఈయన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయ కళాకారుడు. ఈయన పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. తెలుగు యూనివర్సిటీ పాఠ్యప్రణాళికలో మిమిక్రీని సబ్జెక్టుగా పొందుపరచడానికి ఈయనే కారణం. ఈయనకు 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదు కూడా ఉంది.