Power Charges Hike: వినియోగం పెరగకపోయినా డబుల్... జనాలకు షాకిస్తున్న కరెంట్ బిల్లులు
Power Charges Hike: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే భానుడి భగభగలకు మించి మరో అంశంలో ప్రజలు ఉడికిపోతున్నారు. ఈనెలలో వచ్చిన కరెంట్ బిల్లులు జనాలకు షాకిస్తున్నాయి. గత నెలలో కంటే బిల్లులు భారీగా పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
Power Charges Hike: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే భానుడి భగభగలకు మించి మరో అంశంలో ప్రజలు ఉడికిపోతున్నారు. ఈనెలలో వచ్చిన కరెంట్ బిల్లులు జనాలకు షాకిస్తున్నాయి. గత నెలలో కంటే బిల్లులు భారీగా పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ఇప్పటికే జనాలపై భారం పడింది. ఇప్పుడు కరెంట్ ఛార్దీలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెమటలు పడుతున్నాయి. ఈసారి గేటెడ్ వాసులకు కరెంట్ భారంగా మారింది. యూనిట్, డిమాండ్ ఛార్జీల పెంపుతో గేటెడ్ కమ్యూనిటీ వాసుల విద్యుత్ ఛార్జీలు ఊహించినంతగా పెరిగిపోయాయి.
తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏప్రిల్ నెల నుంచి పెరిగిన ఛార్జీలను అమలు చేస్తున్నాయి. ఈనెలలో కొత్త బిల్లులు వచ్చాయి. ఈ బిల్లులు చూసిన జనాలు కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఫీలవుతున్నారు. మార్చి మాసంలో వచ్చిన బిల్లులకు.. ఏప్రిల్ బిల్లులకు పొంతనే లేకుండా పోయింది. వినియోగించిన యూనిట్లలో పెద్దగా మార్పు లేకపోయినా బిల్లు మాత్రం రెండు, మూడు రెట్లు పెరిగింది. 2 వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులపై భారం ఎక్కువగా ఉంది. ఈ కేటగిరిలో కరెంట్ ఛార్జీలు 14 శాతం పెరిగాయి. ఈ సంవత్సరానికి గాను ప్రజలపై 5 వేల 596 కోట్ల రూపాయల భారం వేసింది ప్రభుత్వం. ఎల్టీ కేటగిరిలో గృహ వినియోగంపై యూనిట్ కు 10 నుంచి 15 పైసలు పెంచింది. కమర్షియల్ కు సంబంధించి యూనిట్ కు రూపాయి హైక్ చేసింది. హెచ్ టీ కేటగిరిలోనూ అన్ని శ్లాబులపై యూనిట్ కు రూపాయి పెంచింది.
పెరిగిన కరెంట్ ఛార్జీల భారం గేటెడ్ వాసులపైనా తీవ్రంగా కన్పిస్తోంది. మామూలుగా గేటెడ్ కమ్యూనిటీల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఇందుకు నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యూనిట్ కు రూపాయి పెంచడంతో గేటేడ్ వాసులకు కరెంట్ ఛార్జీలు భారంగా మారాయి. ఇళ్లకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం రెండు రకాలుగా ఉంటుంది. సాధారణ ఇండ్లకు నేరుగా కరెంట్ పోల్ నుంచి కనెక్షన్ ఇస్తారు. గేటెడ్ వాసులుంటే అపార్టుమెంట్లకు అక్కడే ట్రాన్స్ ఫార్మర్ చేసి.. దాని నుంచి ప్యానెల్ బోర్డు ద్వారా ఫ్లాట్లకు సరఫరా చేస్తారు. విద్యుత్ వినియోగాన్ని బట్టి 11KV, 33KV ఫీడర్ల ద్వారా కరెంట్ సరఫరా చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన సీటీ మీటర్ ద్వారా.. రీడింగ్ నమోదు చేసి బిల్లు ఇస్తారు. ఆ రీడింగ్ ఆధారంగా కమ్యూనిటి వెల్ఫేర్ అసొసియేషన్లే ఫ్లాట్లకు సంబంధించిన రీడింగ్ తీసి బిల్లులు వసూల్ చేస్తాయి.
గేటెడ్ అపార్టమెంట్లకు ఎక్కువగా హెచ్ టీ కనెక్షన్లు ఉంటాయి. వీటికి శ్లాబులుండవు. ఒకటే రేట్ ఉంటుంది. మార్చి వరకు యూనిట్ రేట్ రూ 6-30గా ఉంది. ఏప్రిల్ నెల నుంచి యూనిట్ కు రూపాయి పెరగడంతో.. అది ఇప్పుడు రూ 7-30కు పెరిగింది. ఇప్పటివరకు ప్రతి KVకి డిమాండ్ చార్జీ 60 రూపాయలుగా ఉంది. ఇప్పుడిది ఏకంగా 260 రూపాయలకు పెరిగింది. దీంతో యూనిట్ ఛార్జీతో పాటు డిమాండ్ ఛార్జీ భారీగా పెరగడంతో.. ఈనెలలో అందరికీ కరెంట్ బిల్లులు వాత కనిపిస్తోంది. గత నెలకంటే డబుల్ బిల్లులు వచ్చాయంటున్నారు గేటెడ్ వాసులు. వినియోగం పెద్దగా పెరగపోయినా.. ఛార్జీలు డబుల్ అయ్యాయని గగ్గోలు పెడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో విద్యుత్ నష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్యానెల్ బోర్డు నుంచి ఫ్లాట్లకు సరఫరా చేసే క్రమంలో పంపిణి నష్టాలు వస్తుంటాయి. ఇది కూడా కరెంట్ ఛార్జీల పెరుగుదలకు కారణమవుతోంది.
READ ALSO: Gautam Adani Rajyasabha: జగన్ కు భయపడే రాజ్యసభ సీటు వద్దన్నారా! అదానీ ప్రకటనపై ఏపీలో రాజకీయ రచ్చ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook