రేపు ఏ రూట్‌లోనూ బస్సులు తిరగవు అని ప్రకటించిన ఆర్టీసీ డిపో. అవును మీరు చదివింది నిజమే. స్వయంగా ఆర్టీసీ డిపో అధికారులే ఈ విషయాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ రేపు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రగతి నివేధన సభకు జనాన్ని తరలించేందుకు నేతలు మధిర డిపోకు చెందిన అన్ని బస్సులను బుక్ చేసుకోవడంతో ఆ రోజు మధిర డిపో పరిధిలోని ఆర్టీసీ బస్సు సర్వీసులు మొత్తం రద్దు చేసినట్లు డిపో మేనేజర్ నారాయణ స్వయంగా ప్రకటించారు. రేపటి ఆదివారం మధిర డిపో నుంచి బస్సులన్నీ ప్రగతి నివేధన సభకే వెళ్లనున్నట్టు ఈ సందర్భంగా మేనేజర్ సత్యనారాయణ వెల్లడించారు. 


మధిర డిపోలో ఉన్న మొత్తం 65 ఆర్టీసీ బస్సులు డిపో పరిధిలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌, వైరా, తల్లాడ, కొణిజర్ల మండలాలతో పాటు, హైదరాబాద్‌, ఖమ్మం, తిరుపతి, కృష్ణాజిల్లాలోని నందిగామ, విజయవాడ, నెమలి, గంపలగూడెం, తిరువూరు సహా ఇతర సమీప, దూర ప్రాంతాల మార్గాల్లో నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే, ఈ 65 బస్సులను టీఆర్ఎస్ నేతలే బుక్ చేసుకోవడంతో ఇక ప్రజల అవసరాల కోసం ఏమీ కేటాయించలేకపోతున్నామని తమ నిస్సహాయతను వ్యక్తంచేసిన మేనేజర్ సత్యనారాయణ.. ఆదివారం ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుని సహకరించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.