విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో గురువారం ఈ ప్రత్యేక భేటీ జరిగింది. ప్రస్తుత జాతీయ రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, ఆవశ్యకతపై ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం అందుతోంది. ఇంటాలరెన్స్, గోమాంసంపై నిషేధం, గోమాంసంపై నిషేధం నేపథ్యంలో జరిగిన దాడులు వంటి అనేక అంశాలపై ఎప్పటికప్పుడు కేంద్రంపై తన వ్యతిరేక వాణిని బలంగా వినిపిస్తూ వస్తోన్న ప్రకాశ్ రాజ్‌ని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగస్వామిని చేసుకోవాలనే దిశగా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు మీడియా వర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ సర్కార్‌ని #JustAsking హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్విటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ప్రకాశ్ రాజ్, కేసీఆర్‌ల భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.


రాజకీయ చైతన్యమే కాకుండా సామాజిక సేవలోనూ ముందున్న ప్రకాశ్ రాజ్.. అవసరమైతే, కేసీఆర్ చొరవతో థర్డ్ ఫ్రంట్‌లో భాగస్వామిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ కూడా అంతే బలంగా వినిపిస్తోంది. ఏమో!! రాజకీయాల్లో ఎప్పుడు, ఏమైనా జరిగే అవకాశం లేకపోలేదు కదా.. జరిగే వరకు చూస్తూ వుండటం తప్ప!!