గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 16వ తేదీన నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు శనివారం తెలిపారు. దీనిపై అభ్యంతరాలను ఈ నెల 24 నుంచి 30 వరకు స్వీకరిస్తామని తెలిపారు.


700 వీఆర్వో పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 10.58 లక్షల మంది దరఖాస్తుచేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో 10 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 7,87,049 మంది (78.46%) అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగర పరిధిలో 627 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. రెండు మూడు స్వల్ప ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పరీక్ష అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ వెల్లడించారు. అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 83.44%, అత్యల్పంగా వికారాబాద్‌లో 29.06% హాజరు నమోదైందని తెలిపారు. పరీక్ష సజావుగా జరిగేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫిసర్లు, స్పెషల్ స్క్వాడ్లను నియమించినట్లు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా హైదరాబాద్ నుంచి పరీక్ష కేంద్రాలను మానిటర్ చేసినట్లు ఆమె వివరించారు. కాగా.. ఈ పరీక్షకు నిమిషం ఆలస్యం నిబంధన అమలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు.