rahul gandhi tour in telangana : తెలంగాణకు రాహుల్... పర్మిషన్లు రాక కాంగ్రెస్ పరేషాన్..!
rahul gandhi tour in telangana : రాహుల్‌గాంధీ తెలంగాణ టూర్ కాంగ్రెస్ నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. రాహుల్ టూర్ ఏర్పాట్లను చూడటం అటుంచితే .. పర్మిషన్ల కోసమే నానా తిప్పలూ పడాల్సి వస్తోంది. వరంగల్ టూర్ కు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా హైదరాబాద్ లో రాహుల్ పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఎక్కేగడపా.. దిగేగడపా అన్నట్లు చక్కర్లు కొడుతున్నారు.
rahul gandhi tour in telangana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సాధించిపెట్టాలనే లక్ష్యంతో తెగ కష్టపడుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. పార్టీలో సీనియర్లు మూకుమ్మడిగా సహాయనిరాకరణ చేస్తున్నా అధిష్టానం అండదండలతో అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస పర్యటనలు చేస్తూ కేడర్ లో ఉత్సాహం నింపుతున్నాడు. ఇన్నాళ్లూ నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు... ఇప్పుడు భవిష్యత్తుపై అంతో ఇంతో ధైర్యం వచ్చిందంటే అందుకు కారణం రేవంత్‌రెడ్డే అని చెప్పకతప్పదు. ఓ వైపు అధికార టీఆర్ఎస్ దూకుడు.... మరోవైపు వరుస విజయాలతో ఊపుమీదున్న బీజేపీని తట్టుకొని కాంగ్రెస్ పార్టీని పోటీలోకి తేవడానికి రేవంత్‌రెడ్డి శక్తినిమించి ప్రయత్నాలుచేస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సమరాంగణంలోకి దూకారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. దీనికోసం ఇప్పటినుంచే ప్రజల్లోకి దూకుడుగా వెళ్తున్నారు. రాహుల్‌గాంధీ టూర్‌తో అధికారికంగా అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలనేది రేవంత్‌రెడ్డి భావన. అందుకే రాహుల్ టూర్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీనికోసం గత నెల రోజులుగా రాష్ట్రమంతా తిరుగుతూ కేడర్‌ను ఉత్సాహపరుస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ సభ ద్వారా ఎండగట్టాలని.. తామే అసలైన విపక్షమని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వరంగల్‌లో రైతుసంఘర్షణ సభ నిర్వహిస్తున్నారు. ఇక నిరుద్యోగులు, యువతలో ప్రభుత్వంపై ఉన్న అసహనాన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి రాహుల్ ను ఓయూకి తీసుకెళ్లాలని రేవంత్ ప్లాన్ చేశారు. వరంగల్ సభకు అన్ని పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వం ఓయూ టూర్ విషయంలో మాత్రం మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోంది. వీసీ పేరుతో పర్మిషన్లు ఇవ్వకుండా సతాయిస్తోంది. దీంతో గత పదిహేను రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు పర్మిషన్ల కోసం తిరగడమే సరిపోయింది.
రాహుల్ ఓయూ సభకోసం రెండు సార్లు వీసీని కలిశారు కాంగ్రెస్ నేతలు. కానీ వీసీ పర్మిషన్ ఇవ్వలేదు. చివరకు ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో చంచల్ గూడ జైల్లో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులతో ములాఖత్ కు రాహుల్ ను తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి భావించారు. ఇలాగైతే జాతీయమీడియా ఫోకస్ కూడా తమపై పడుతుందనుకున్నారు. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతలు పర్మిషన్లకోసం తిరగడమే సరిపోతుంది. మామూలుగా ములాఖత్ కు జైలు సూపరిండెంట్ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. కానీ రాహుల్ గాంధీది రాజకీయ ములాఖత్ కావడంతో జైలు సూపరిండెంట్ పర్మిషన్ విషయంలో చేతులెత్తేశారు. జైళ్ల శాఖ డీజీని కలవాలని సూచించారు. మళ్లీ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేతలు తాజాగా జైళ్ల శాఖ డీజీని కలిసి ములాఖత్ కు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఆయన కూడా ఆలోచించి నిర్ణయం చెబుతామని తెలిపారు. రాహుల్ టూర్ కు మరికొన్ని గంటలే మిగిలిఉన్నా... అనుమతులు రాకపోవడంతో షెడ్యూల్ ఫిక్స్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు. ఫలితంగా టూర్ ప్లానింగ్ లో మార్పులు అనివార్యమవుతున్నాయి. అధికార పార్టీ కావాలనే తమను ఇలా ఇబ్బందులకు గురిచేస్తోందని .. రాహుల్ టూర్ అంటే టీఆర్ఎస్ భయపడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ నేతల ఉరుకులు పరుగులను ఎంజాయ్ చేస్తున్నారు.
also read: Political Heat In Telangana: తెలంగాణలో జాతీయ నేతల టూర్లు..మొదలైన ఎన్నికల జాతర
also read: saroornagar honour killing: సరూర్‌నగర్ పరువుహత్య, రాజకీయ దుమారం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.