హైదరాబాద్: శీతాకాలంలో హైదరాబాద్‌ని అనుకోని అతిథి పలకరించింది. గురువారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, రాజేంద్రనగర్, శామీర్‌పేట, హకీంపేటతోపాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. తేలికపాటి జల్లులతోపాటు చల్లటి గాలుల కారణంగా హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు నమోగు కాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. 


ఇదిలావుంటే, దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏర్పడిన పెథాయ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు, మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుపాటు వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.