పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లింలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఇవ్వనున్నారు. ఈ ఇఫ్తార్ విందుకు ఐదువేల మందికి పైగా ముస్లింలు హాజరుకానున్నారు. సాయంత్రం ప్రార్థనల అనంతరం దావత్ ప్రారంభమవుతుంది. ఈ విందులో సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ట్రాఫిక్, వాహనాల పార్కింగ్‌లతో పాటు మరెలాంటి సమస్యలు తలెత్తకుండా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10న గవర్నర్ ఇఫ్తార్ విందు


రాష్ట్ర ముస్లింలకు రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.  ప్రతి ఏడాది రంజాన్ నెలలో గవర్నర్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.


రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రంలోని 800 మసీదుల వద్ద శుక్రవారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నది. సీఎం ఇఫ్తార్ విందు, రాష్ట్రవ్యాప్తంగా విందులు, దుస్తుల గిఫ్ట్ ప్యాకెట్ల కోసం ప్రభుత్వం రూ.30 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు. నిరుపేద ముస్లింలకు ఒక్కో కుటుంబానికి మూడు జతల దుస్తులతో కూడిన రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను శుక్రవారం నుంచి పంపిణీ చేయనున్నారు.