Revanth Reddy About Rythu Bandhu Scheme: రాజకీయాలనే భవిష్యత్తుగా మార్చుకుని ప్రజా సేవ చేయాలనుకునే వారికి యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక చక్కటి వేదిక అవుతుంది అని చెప్పడానికి తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేనే మనకు ఒక ఉదాహరణ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడింది అని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. డబుల్ ఇంజన్ అంటే గౌతం అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ సర్కారు పని ఎద్దేవా చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్ నేషన్.. వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేద్దాం. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మీరంతా కష్టపడాలి. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు.


డిసెంబర్ 9న సోనియా జన్మదినం కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాకు తెలంగాణలో పార్టీ విజయాన్ని పుట్టిన రోజు కానుకగా ఇవ్వాలి అని అన్నారు. 
యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఏ విధంగా పనిచేయాలి... రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యడానికి ఏ విధంగా పనిచేయాలి అనే అంశాలపై చర్చించారు. 


క్షేత్ర స్థాయిలో కొట్లాడే యూత్ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. కష్టపడిన వారికి కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ఉంటుంది అని సూచించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి నియంతలను ఎదిరించాలంటే యూత్ కాంగ్రెస్ కసితో పనిచేయాలన్నారు. గడీల పాలనను తిరిగి తీసుకురావడానికి ధరణి పోర్టల్ వచ్చింది. తెలంగాణలో భూ పోరాటాలు బాగా జరిగాయి. దొరల కోసమే ధరణి తీసుకొచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బరాబర్ ధరణి పోర్టల్‌ని రద్దు చేస్తాం. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలు కేసీఆర్ బినామీ పేర్లతో ఎక్కించుకున్నాడు. 97 శాతం భూ వివాదాలకు ధరణి కారణమైంది. గిరిజనులను, ఆదివాసులను భూమి లేని వారిని చేసిండ్రు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీసీఎల్ఏ వద్ద, అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం పిలిపిన్స్ కంపెనీ చేతుల్లోకి పోయింది. ప్రజల ఆస్తుల వివరాలు ఇతర వ్యక్తుల చేతుల్లోకి ఎలా పోతాయి అని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. 


ధరణి పోర్టల్ పోతే రైతు బంధు పడదు అని చెప్పి రైతులను లేనిపోని భయాందోళనకు గురిచేస్తున్నారు. ఊరూరూ తిరిగి ధరణి పోతే రైతు బంధు రాదు అని మొత్తుకుంటూ రైతులను భయపెడుతున్నారు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి ఎత్తివేస్తాం అనేది అక్రమ భూముల కేటాయింపులను అడ్డుకోవడానికి మాత్రమే కానీ రైతు బంధును అడ్డుకోవడానికి కాదు అని తేల్చిచెప్పారు.