తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు చేశారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని, కచర చంద్రశేఖర్ రావు అని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ నరసింహన్‌కు సీఎం కాళేశ్వరం చంద్రశేఖర్ రావులా కనిపిస్తే... మాకు మాత్రం కచర చంద్రశేఖర్ రావులా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం మెట్‌పల్లిలో చేపట్టిన రైతు గర్జన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 


రైతు గర్జన వేదికపై నుంచే రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ పాలనలో 3400 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆరోపించిన రేవంత్ రెడ్డి..  ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీని తెరిపించేందుకు రూ.400 కోట్లు ఇవ్వడం లేదని అన్నారు. చెరుకు ఫ్యాక్టరీ తెరిపించే వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా రైతులకి రేవంత్ హామీ ఇచ్చారు.