త్వరలోనే హరీష్ రావు టీఆర్ఎస్ నుంచి బయటికి : రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఆరోపణలు
ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీలో ఆధిపత్య పోరాటం, వర్గ పోరు నడుస్తోందని, త్వరలోనే మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ ఆ పార్టీ నుంచి బయటికి పంపించేస్తారని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో ముఖ్యమంత్రి కుటుంబం వాటాలు పంచుకుంటోందని.. మామకు 10 శాతం, అల్లుడికి రెండు శాతం ముడుపులు ముడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం కృషిచేస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేయకుండా మోసం చేస్తోందని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అనే అంశంపై టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన వైఖరి కొరవడింది అని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఒకానొక సందర్భంలో లోక్ సభ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించగా, అదే పార్టీకి చెందిన హరీష్ రావు, వినోద్‌లు మాత్రం హోదాను వ్యతిరేకించారు. ఇదంతా చూస్తోంటే, ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ పార్టీకే స్పష్టమైన వైఖరి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అన్నింటికిమించి ప్రత్యక్షంగా రాష్ట్రంలో, పరోక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మీరే మీ వైఖరి ఏంటో చెప్పకుండానే కాంగ్రెస్ పార్టీకి వైఖరి లేదని విమర్శించడం ఎంతమేరకు సబబు అవుతుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రశ్నించారు.