సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. వనమా రాఘవకు కేసీఆర్ అండదండలు.. : పాల్వంచ ఘటనపై రేవంత్
Revanth Reddy on Palvancha family suicide incident: పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడు వనమా రాఘవను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిందితుడికి కేసీఆర్ అండదండలు ఉన్నాయని... అందుకే అరెస్ట్ చేయట్లేదని ఆరోపించారు.
Revanth Reddy on Palvancha family suicide incident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో (Naga Ramakrishna Selfie Video) బయటకు రావడంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. తాజాగా ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. రామకృష్ణను వేధించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వనమా వెంకటేశ్వరరావుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలన్నారు.
'వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ (Vanama Raghava) రామకృష్ణను వేధించి.. అతని భార్యపై దారుణంగా మాట్లాడాడు. సెల్ఫీ వీడియో ద్వారా అతను చెప్పింది వింటే సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి. మనుషులు ఇంత దారుణంగా మృగాలుగా మారి వ్యవహరించడం బాధాకరం. రాజకీయాల్లో విలువలు పాటిస్తున్నామని కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటుంటారు. ఆయన నాయకత్వంలోని శాసనసభ్యుడు, అతని కుమారుడు మధ్య తరగతి కుటుంబాలను పట్టి వేధిస్తున్న, పీడిస్తున్న ఘటనలకు ఇది ఉదాహరణ. ఆ కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటివరకూ ఆ మానవ మృగాన్ని అరెస్ట్ చేయలేదు.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
'టీఆర్ఎస్ నేత వనమా రాఘవపై (Vanama Raghava) ఇంతవరకూ పార్టీ పరమైన చర్యలు కూడా తీసుకోలేదు. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి అండదండలు ఉన్నందువల్లే వనమా రాఘవను పోలీసులు ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు. ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. ఇలాంటి దుర్మార్గులను కాపాడే చర్యలకు కేసీఆర్ పాల్పడటం శోచనీయం. ఇకనైనా వనమా రాఘవను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఈ ఘటనపై ప్రత్యేక విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సంచలనం రేపుతోన్న రామకృష్ణ సెల్ఫీ వీడియో :
తన తల్లి, సోదరితో ఆస్తి వివాదానికి తోడు వనమా రాఘవ (Vanama Raghava) వేధింపులతో కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు వనమా రాఘవను ఆశ్రయించగా... అతను తన భార్యపై అసభ్యంగా మాట్లాడినట్లు చెప్పాడు. ఆమెను తన వద్దకు పంపిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని... అంతవరకూ ఆ సమస్య అలాగే ఉంటుందని బెదిరించినట్లు చెప్పాడు. ఓవైపు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు... మరోవైపు వనమా రాఘవ వేధింపులు... ఇవన్నీ తట్టుకోలేక రామకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: Disha Patani In Pink Bikini: హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు.. పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook