తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తానంటున్నారు. పార్లమెంట్ కార్యదర్శుల నియామకంలో తెలంగాణ ప్రభుత్వం నియమనిబంధనలని పాటించలేదని, పూర్తిగా అక్రమంగా జరిగిన వారి నియామకం చెల్లదని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. శనివారం ఇదే విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "తెలంగాణ ప్రభుత్వం ప్రజలకి అబద్దాలు చెప్పి, కోర్టు కళ్లుకప్పి 121 మంది పార్లమెంట్ కార్యదర్శుల నియామకం చేసింది" అని అన్నారు. 


అక్రమ మార్గంలో చేపట్టిన పార్లమెంట్ కార్యదర్శుల నియామకం చెల్లనందున వారిని వెంటనే ఆ స్థానాల్లోంచి తొలగించాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. లేనిపక్షంలో తాను హై కోర్టులో మోషన్ పిటిషన్ వేసేందుకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. ఈ నియామకానికి ముందు ప్రభుత్వం కోర్టు అనుమతి తీసుకోవాల్సి వుండెనని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.