కొడంగల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న రేవంత్ రెడ్డి.. తన ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. అందులో తనపై 36 కేసులు ఉన్నట్లు, అందులో ఓటుకు నోటు కేసు కూడా ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే గత ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం ఆయనపై ఒక్క కేసు కూడా లేకపోవడం గమనార్హం. అలాగే అఫిడవిట్‌లో భాగంగా రేవంత్ తన ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు. తన చరాస్తుల విలువ రూ.1,74,97,421 గా.. స్థిరాస్తుల విలువ రూ.2,02,69,000 ఉన్నట్లు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన భార్య పేరు మీద ఉన్న చరాస్తుల విలువను 2,27,79,935 రూపాయలుగా, స్థిరాస్తుల విలువను 2,36,40,000 రూపాయలుగా అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. మార్కెట్‌ విలువ ప్రకారం రేవంత్ రెడ్డి తన పేరు మీద రూ.7,89,69,650 విలువ గల ఆస్తులు, తన సతీమణి గీత పేరిట 9,44,64,000 రూపాయల విలువ గల ఆస్తులు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. గత ఎన్నికలలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగి ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డిని.. 2015లో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ శాసన సభ్యులు  స్టీఫెన్‌కు రేవంత్ డబ్బులు పంపిణీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 


తర్వాత రేవంత్ తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిశారు.  2009లో కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించిన రేవంత్ రెడ్డి.. 2014లో కూడా టీడీపీ తరఫునే బరిలోకి దిగి గెలిచారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం పెరుగుతుందని అన్నారు. కానీ తెలంగాణ ఏర్పాడ్డాక.. ఓటుకి నోటు కేసులో చిక్కుకున్నారు.