Revanth Vs Bhatti: రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి.. రెండుగా చీలిన తెలంగాణ కాంగ్రెస్?
Revanth Vs Bhatti: యాదాద్రి, ఇఫ్తార్ విందులో జరిగిన అవమానం భట్టి విక్రమార్క మదిలో పాతుకుపోయింది. జూనియర్ అయిన రేవంత్ రెడ్డి పెత్తనాన్ని సహించలేని భట్టి తన దారి చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ఏర్పాట్ల పరిశీలన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
Revanth Vs Bhatti: అసెంబ్లీ ఎన్నికల విజయంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. పార్టీలో ఎన్నో వర్గాలు ఉన్నా.. కలిసి పనిచేయకున్నా బీఆర్‌ఎస్ పార్టీపై కోపంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేశారు. విజయం సాధించినా కూడా ఆ పార్టీలో విబేధాలు, గ్రూపు రాజకీయాలు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం ఏర్పాటుతో తాత్కాలికంగా ఆయా వర్గాలు కొంత చల్లబడినా లోలోపల మాత్రం అసంతృప్తి జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. పైకి ఏం లేదని నటిస్తున్నా పలు నాయకుల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయడంతోపాటు ముఖ్యమంత్రి చేయడంతో ఖమ్మం, నల్లగొండకు చెందిన సీనియర్ నాయకులు తీవ్ర అసహనంలో ఉన్నారు. సీనియారిటీని కాదని.. ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కాంగ్రెస్‌లో మెజార్టీ వర్గానికి నచ్చలేదు. ప్రభుత్వంలో పలు పదవులు దక్కడంతో రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు కొంత శాంతించాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా వర్గ విబేధాలు సద్దుమణగలేదని స్పష్టమవుతోంది.
ముఖ్యంగా సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసంతృప్తితో రగులుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవి రేసులో దళితుడైన భట్టి విక్రమార్క పేరు ప్రధానంగా వినిపించింది. అయితే అధిష్టానం వద్ద ఏం చర్చలు జరిపారో ఏమో కానీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఆ పదవి దక్కింది. భట్టిని ఉప ముఖ్యమంత్రి చేసి వదిలేశారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. ఇది పలుచోట్ల స్పష్టంగా కనిపిస్తోంది. అసంతృప్తితో ఉన్నారనే కారణంతోనే ముఖ్యమంత్రి నివసించాల్సిన 'ప్రగతి భవన్'ను భట్టికి కేటాయించారు. సీఎం పదవి దక్కలేదు కనీసం సీఎం అధికారిక నివాసం ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి వర్గం భావిస్తోంది.
మొదటి నుంచి పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి విక్రమార్క అనేది సాగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను భట్టి ఆమోదం తెలపలేదు. అధిష్టానం సూచన మేరకు నిశ్శబ్దంగా ఉన్నారు కానీ ఏనాడూ రేవంత్‌పై నోరు మెదపలేదు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా భట్టి వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. ముఖ్యమంత్రి పదవిని రేవంత్ తన్నుకుపోవడంతో భట్టిలో మరింత అసంతృప్తి చెలరేగింది. అధికారిక కార్యక్రమాల్లోనూ వీరిద్దరూ ఎడమొహం పెడమొహం అనే రీతిలో ఉన్నారు.
ఇక యాదాద్రిలో 'పీట' విషయంలో జరిగిన అవమానం భట్టిని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. పైకి ఏదో ప్రకటన చేశారు కానీ బ్రహ్మోత్సవాల్లో జరిగిన అవమానం మనసును తీవ్రంగా కలచివేసింది. ఇక ఇఫ్తార్ విందులో కూడా అలాంటి అవమానమే జరిగింది. ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఫొటోలు కనిపించడం లేదు. ఇలా తరచూ అవమానాలు జరుగుతుండడంతో భట్టి విక్రమార్క సహించడం లేదు. దీంతో రేవంత్‌కు దూరంగా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలు, అధికారిక కార్యక్రమాల్లో రేవంత్ పక్కన కనిపిస్తున్నా భట్టి మాత్రం దూరం పాటిస్తున్నాడు. గవర్నర్ ప్రమాణస్వీకారంలో భట్టి కనిపించలేదు. మరుసటి రోజు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా తుక్కుగూడ సభలో ఉదయం భట్టి విక్రమార్క ఏర్పాట్లు పరిశీలన చేశారు. సాయంత్రం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇద్దరు నాయకులు వేర్వేరుగా పరిశీలించడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గం పెత్తనాన్ని భట్టి సహించడం లేదు. ఒక్క భట్టినే కాదు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు రేవంత్‌పై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
భట్టితోపాటు మరికొందరు
తమ కుటుంబసభ్యులకు నల్లగొండ పార్లమెంట్ సీటు ఆశించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రేవంత్ రెడ్డి షాకిచ్చారు. ఖమ్మం ఎంపీ సీటు విషయంలో పొంగులేటి, భట్టి కుటుంబసభ్యులు ఆశిస్తుండగా వారిని కాదని వేరేవారికి టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. ఈ వ్యవహారం కూడా పార్టీలో తీవ్ర స్థాయిలో రచ్చ రేపు అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారం ఉంది కదా అని అందరూ నోరు మెదపకుండా ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత పదవులు దక్కడంతో ప్రస్తుతం పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలే కావడంతో పార్టీలో రగులుతున్న అసంతృప్తి ఇంకా బయటకు రావడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు అటు ఇటు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. ఇదే విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీలోకి మొదట వెళ్లేది రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు కూడా కొట్టిపారేయలేని పరిస్థితి. ప్రస్తుతం దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. జూన్ 4వ తేదీ వరకు వేచి చూస్తే చాలు. ఆ తర్వాత జరిగే రాజకీయాలు ఎవరి ఊహకు అందవు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.