హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. టీఆర్టీ ఫలితాలు ప్రకటించి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటికీ వారికి నియామక పత్రాలు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇకనైనా టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఈ లేఖ ద్వారా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు, ఢిల్లీ పర్యటనపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగులుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌రావుకు ఆగమేఘాల మీద మంత్రివర్గంలో అవకాశం కల్పించిన మీకు టీఆర్టీ అభ్యర్థుల ఆవేదన పట్టదా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.


నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వానికి ఏ మేరకు శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. రెండేళ్ల నుంచి అభ్యర్థులకు నియామకపత్రాలు ఇవ్వని టీఆర్ఎస్ ప్రభుత్వం సోమరితనానికి కచ్చితంగా గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కుతుందని తెలంగాణ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.