పోలీసులను పరుగులు పెట్టించిన సీఐ వాట్సాప్ మెసేజ్
పోలీసులను పరుగులు పెట్టించిన సీఐ వాట్సాప్ మెసేజ్
బోధన్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రుద్రూర్ సీఐ దామోదర్ రెడ్డి పోలీస్ అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసిన ఓ మెసేజ్ ఉన్నతాధికారులను పరుగులు పెట్టించినట్టు తెలుస్తోంది. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల నుంచి భరించలేనంత ఒత్తిడి ఉందని.. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే, తనకు ఇక ఆత్మహత్యే మార్గమని రుద్రూర్ సీఐ దామోదర్ రెడ్డి చేసిన వాట్సాప్ పోస్ట్ అధికారవర్గాలను కలవరపాటుకు గురిచేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనుసరిస్తామని రాష్ట్ర సర్కార్ చెబుతూ వస్తున్నప్పటికీ.. పోలీసు వ్యవస్థలోనే ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన దామోదర్ రెడ్డి.. 30 ఏళ్ల సర్వీసులో బలిదానం తప్పదేమోనని బలహీన క్షణాలు భయ పెడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేయడం చర్చనీయాంశంగా మారింది.
సీఐ దామోదర్ రెడ్డి వాట్సాప్ మెసేజ్‌తో ఖంగుతిన్న పై అధికారులు... అతడిని సెలవులో వెళ్లాలని ఆదేశించడంతోపాటు ముందస్తు జాగ్రత్త చర్యగా సీఐని కార్యాలయ సిబ్బంది ఎస్కార్ట్ వాహనంలోనే ఇంటివద్ద దింపివచ్చేలా చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలావుంటే, దామోదర్ రెడ్డి వైఖరికి, అతడి మనస్థాపానికి కారణం అధికారుల నుంచి ఛార్జ్‌మెమో జారీ కావడమే అని పోలీసు అధికారులు చెప్పుకుంటున్నారు. అయితే, ఆ చార్జిమెమో జారీ వెనుకున్న కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.