తెలంగాణలో నేటి నుంచే రైతు బీమా పథకం
రైతు బీమా పథకం నేటి నుంచే అమలులోకి వస్తుంది: తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకం నేటి నుంచి అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా రూ. 6 లక్షల ఆర్థిక సహాయం అందచేయనున్నట్టు సీఎం తెలిపారు. యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు పనిముట్లపై 50 నుంచి 90 శాతం సబ్సిడీ కల్పించడం జరిగింది. అలాగే డ్రిప్ ఇరిగేషన్‌పై దళితులు, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు.
రానున్న నవంబర్‌లో రైతు బంధు రెండో విడత చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. వ్యవసాయానికి మరింత ఊతం అందించేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, భవిష్యత్‌లో కోటి ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు.