lessons on CAA and NRC to students : సీఏఏ, ఎన్ఆర్సిపై విద్యార్థులకు పాఠాలు
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలువురు వాలంటీర్లు నడుంబిగించారు. దాదాపు 400 విద్యా సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్న తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సైతం తమ విద్యా సంస్థల్లో ఈ తరహా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలువురు వాలంటీర్లు నడుంబిగించారు. దేశంలో ఏం జరుగుతుందో నేటితరం యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న పలువురు వాలంటీర్లు ఓ బృందంగా ఏర్పడి హైదరాబాద్‌లోని పలు పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. వాలంటీర్ల పిలుపు మేరకు టోలిచౌకి, షేక్‌పేట్ పరిసరాల్లోని ఎన్నో విద్యా సంస్థలు వారికి ఆహ్వానం పలుకుతున్నాయని తెలుస్తోంది. సిఎఎ, ఎన్ఆర్‌సిలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఆందోళనలు చేపట్టి తమ గళం వినిపిస్తున్న నిరసనకారులే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
విద్యా సంస్థలను సందర్శించడానికి ఒక గంట ముందుగా వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుందని.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉండటం కోసమే ఆయా విద్యాసంస్థల పేర్లను వెల్లడించడం లేదని ఆ బృందంలోని ఓ వాలంటీర్ చెప్పినట్టుగా టీఓఐ కథనం పేర్కొంది. అంతేకాకుండా దాదాపు 400 విద్యా సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్న తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (Telangana Private Schools Joint Action Committee) సైతం తమ విద్యా సంస్థల్లో ఈ తరహా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.
ఇదిలావుండగా.. తెలంగాణలోని బీజేపి సైతం విద్యార్థులకు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితాపై అవగాహన కల్పించేందుకు శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే బీజేపి అధికార ప్రతినిథి రఘునందన్ రావు సైతం ఇటీవలే రామంతపూర్‌లోని అరోరా కాలేజీని సందర్శించి ఎన్ఆర్‌సి ఆవశ్యకతపై ఓ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..